Monday, March 31, 2025

శ్రీ సీతారాముల కళ్యాణం/ మరో చరిత్ర

అంశం: శ్రీ సీతారామ కళ్యాణం 


శీర్షిక: *శ్రీ సీతారాముల కళ్యాణం*


తరువుల లేత కొమ్మలు చిగురించు వేళ 

చిరు జల్లులు కురుయు శుభ వేళ 

కోకిలలు కుహుకుహూ అంటూ కూయగ

చైత్ర శుక్ల పక్ష నవమి రోజున వచ్చు 

శ్రీ సీతారాముల కళ్యాణం కమనీయం 

కనిన వినిన స్మరించిన జీవితం ధన్యం! 


దశరధ కౌసల్య ముద్దుల తనయుడు 

కోదండ రాముడు స్వయంవరంలో 

శివ ధనుస్సు నెక్కుపెట్టగ సంతసించే జానకి 

రఘురాముడిని వరించే పూలమాలతో! 


నింగి నుండి దేవతలు కుసుమాలు కురిపించ 

ఋషులు రాజులు పురజనుల హర్షధ్వానాలు

వేద మంత్రాలతో మంగళ వాయిద్యాల నడుమ 

శ్రీ సీతారాముల పరిణయం శోభాయమానం!


ప్రతి యేటా చైత్ర శుక్ల నవమి రోజున 

శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం భద్రాద్రిలోనూ 

ప్రతి గుడిలోనూ  వైభవోపేతంగా జరిపేరు 

తెలంగాణ నుండి ముఖ్యమంత్రి గారు 

భద్రాచలం శ్రీ సీతారాముల వారికి 

పట్టువస్త్రాలు ముత్యాల తలంబ్రాలు 

సమర్పించడం ఒక ఆనవాయితీ!

సీతా రామ కళ్యాణం

అంశం: శ్రీ సీతారామ కళ్యాణం


శీర్షిక: *శివ ధనుస్సు ఎత్తె*

ధశరథ మహారాజు కౌసల్యల
ముద్దుల తనయుడు శ్రీరాముడు
విలువిద్యలందు అస్త్రశస్త్రాలందు
ఆరితేరిన ఘనుడు అయోధ్య రాముడు!

స్వయంవరం ఏర్పాటు జేయ జనకుడు
దేశ దేశాల రాజులు వరుసలో కూర్చునే
ధనుస్సు ఎత్త లేక చతికిల బడగ
విలువిద్యలో నేర్పరి విల్లు నెత్త సమర్ధుడు
ఒక్క చేతితో ఎత్తె శివ ధనుస్సు అవలీలగా!

తగిన సమర్ధుడు అతడేనని తలచిన జానకి
పట్టరాని సంతోషంతో సిగ్గు వొలకబోస్తూ
హర్షధ్వానాల మధ్య హరి మెడలో హారం వేసే
మిథిలా నగర ప్రజల సంబురాలు నింగికెగెసే!

చైత్ర శుక్ల నవమి రోజున దేశ దేశాధి రాజులు
రాణులు ఋషులు వేలాది  ప్రజలు రాగా
వేద మంత్రాలతో మంగళ వాయిద్యాలతో
శ్రీ సీతారాముల కళ్యాణం జరిగే
అంగరంగ వైభవంగా!


         

మౌనం మనోబలానికి స్ఫూర్తి

అంశం: మౌనం తోటలోకి 

శీర్షిక: *మౌనం మనోబలానికి స్ఫూర్తి*


*మౌనం రెండు వైపులా పదునైన ఖడ్గం*

*మౌనం బహుళార్థ సాధక సాధనం*

*మౌనం తపోతోటలో మధురామృతం*

*మౌనం మాధుర్యం భాష్యం అనంతం*


మౌనం మేధస్సును ఇంద్ర ధనుస్సులా

జ్ఞానాన్ని గణనాథుడిని తలపించునట్లుగా

మనిషి విలువలను ఆకాశమెత్తులో

వ్యక్తిత్వాన్ని ఎవరెస్ట్ శిఖరాన్ని మించి

హృదయ వికాసానికి రెక్కలు తొడుగుతుంది!


తన సమ్మతిని తెలియజేయడానికి 

మౌనం అర్ధాంగీ కారమని చెబుతారు 

మౌనంగా తపస్సు చేసే ఋషులకు 

భూత వర్తమాన భవిష్యత్ కాలాల

సంఘటనలు స్ఫురణకు వస్తాయంటారు!


మరోవైపు మౌనాన్ని చూస్తే 

మౌనం అమాయకత్వానికి ఆనవాలు 

అజ్ఞానానికి తెలివి తక్కువ తనానికి ప్రతీక 

చేతకాని తనానికి నిదర్శనం 

విలువ లేని తనానికి నిలువెత్తు అద్దం 

సోమరి తనానికి ప్రతిబింబం! 


మౌనులు అజ్ఞానులకు జ్ఞానాన్ని బోధిస్తారు 

మౌన మునులు సమాజ హితకారులు 

శ్రీకృష్ణుడు గౌతమ బుద్ధుడు 

స్వామి వివేకానంద రామకృష్ణ పరమహంస

దయానంద సరస్వతి బ్రహ్మం గారు మరెందరో!


మౌనం వలన జ్ఞానమే కాదు 

మౌనం సమాజ హితమే కాదు 

వారి ఆయురారోగ్యాలు వృద్ధి చెందు

మౌనం మనోబలానికి స్ఫూర్తి 

మనోబలంతో అనూహ్య విజయాలు 

గొప్ప పేరు ప్రఖ్యాతులు సిద్ధించు

ఆనందమైన ప్రశాంతమైన జీవితం మౌనంతోనే !


         

జీవిత సత్యాలు/విపంచికలు

అంశం:విపంచికలు


శీర్షిక: *జీవిత సత్యాలు*

చీకటి వెలుగుల మాయాలోకం ఇది
ప్రపంచంలో మంచి చెడులు సహజం
గమనించాల్సినది ఇక్కడ జ్ఞానులెవరు మూర్ఖులెవరను సత్యం
వెలుగుల చెడులు మూర్ఖలెవరను జ్ఞానం
అది అసహజం అసత్యం అజ్ఞానం!

గెలుపు ఓటమిలు సహజం మానవులకు
జీవులకు జననం మరణం తప్పదు
అయినా అనుభవిస్తారు సుఖాలు దుఃఖాలు ఎల్లవేళలా
ఓటమిలు మరణం  దుఃఖాలు సుఖాలు
దానవులకు తప్పవచ్చు అప్పుడప్పుడు దుఃఖాలు!


తిన్నా తినకున్నా సంసారానికి గుట్టుండాలి
బయట మనవారెవరో పరాయివారెవరో తెలియదు
ఎవరితోనూ మనవి లాభాలు నష్టాలు చెప్పొద్దు  ఎప్పుడూ
తినకున్నా పరాయివారెవరో నష్టాలు లాభాలు
బహిర్గతమవ్వాలి తెలియును ఇప్పుడూ నష్టాలు!

           

Sunday, March 30, 2025

ఇది ఒక విషమ పరీక్షా సమయం

అంశం: పరీక్షా సమయం


శీర్షిక: *ఇది ఒక విషమ పరీక్షా సమయం*

ఆకాశంలో పరుగులు తీసే గ్రహాలకు
అవనిలోని ఉరుకుల పరుగుల జనాలకు
ఇది ఒక విషమ పరీక్షా సమయం
షష్టి గ్రహాలన్నీ ఒకే గుడిలోకి రాబోతున్నాయి
రాహువు కేతువుల మధ్య బంధింపపడుతున్నాయి!

మార్చి మాసం లోనే *క్రోధి* వెళ్లి
*విశ్వా వసు* నామ సంవత్సరం
ప్రారంభం కాబోతోంది
ప్రజలలో నమ్మకాన్ని పెంచుతుందా
లేక తుంచుతుందా వేచి చూడాల్సిందే!

*మార్చి మాసం విద్యార్ధులకుపరీక్షా సమయం*
పది ఇంటర్ డిగ్రీ పరీక్షల సమయం
దిశను భవిష్యత్తును నిర్దేశించే సమయం
ర్యాంకులు గ్రేడులంటూ కార్పోరేట్ సంస్థల
ఆరాటం పోరాటం విద్యార్థులపై వత్తిడి!

*ఇది ప్రజలకు పరీక్షా సమయం*
విద్యార్థుల పరీక్షలతో తల్లిదండ్రులలో అలజడి
పంటలు  లేక పనులు లేక ఇండ్లు కూలి
ఉద్యోగాలు ఊడి కొందరు సతమతం!

*ఇది భారత దేశానికి పరిక్షా సమయం*
ప్రజల సమిష్టి అభివృద్ధే దేశాభివృద్ధి
పెద్దన్న రాకతో ప్రపంచ దేశాలు వణికీ
పోతున్నాయి అందులో భారత దేశం ఒకటి!

అదిగో టారిఫ్ ఇదిగో టారిఫ్ అంటూ
హెచ్చరికలు జారీ చేస్తుండే
షేర్ మార్కెట్ కుప్పకూలే
ఇన్వెస్టర్ల జీవితాలు అగమ్యగోచరం
ఏడు ట్రిలియన్ల అభివృద్ధి ప్రశ్నార్థకం
ఆర్ధిక వ్యవస్థ చిన్నా భిన్నమాయే
ఫారెన్ ఇన్వెస్టర్లకు పండుగే పండుగ!

*ఇది ప్రకృతికి పరిక్షా సమయం*
షష్టి గ్రహ కూటమి కావడం గ్రహాలు ఏర్పడటం
పలు కారణాల వలన అనేక ఉపద్రవాలు
సముద్రాలలో ఆటుపోటులు కరువుకాటకాలు
జరుగుతాయని జ్యోతిష్యశాస్త్రం హెచ్చరిక!

Saturday, March 29, 2025

ఉగాది గేయాలు


అంశం: ఉగాది గేయాలు


శీర్షిక: *రావమ్మా ఉగాది రావమ్మా!*


రావమ్మా ఉగాదీ రావమ్మా...

*క్రోధీ* నీ సాగనంపీ....      "2"

*విశ్వా వసు* ను తోలుకుని రావమ్మా...

జీవితమంటే కోపం తాపం జాలి... 

ప్రేమ దయనే అంటూ.....

గొప్ప సందేశాన్నీ ....

మోసుకునీ రావమ్మా...                      "రావమ్మా" 


చరణం:01

కోడి కూయక ముందే....

పొద్దు పొద్దున్నే లేచి...

కోకిలలు కుహూ కుహూ అని కూస్తుండ..

పడతులు  లోగిళ్ళు ఊడ్చి..

కళ్ళాపి చల్లి  రంగవల్లు లేయంగా...     "రావమ్మా "


చరణం :02      

తలంటు స్నాన మాచరించి...

కొత్త వస్త్రాలను ధరించి....

గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టి...

పూలదండలు చుట్టి....

ఇష్టమైన దైవాన్ని నిష్టతో గొలువంగ.... "రావమ్మా"


చరణం:03

తీపి పులుపు ఉప్పు కారం..

చేదు వగరు షడ్రుచుల పచ్చడి సేవించ..

పంచ బక్షాలు, పరమాన్నాలను...

పిండి వంటలనారగించి....

మమ్ములను  దీవించ...               "రావమ్మా"

    

   

ఉపమాలంకారాలు

అంశం: అలంకారాలు (ఉపమాలంకారాలు)

(ఉపమేయం ఉపమానం ఉపమావాచకం, సమా ధర్మం కలిగి ఉండటం ఉపమాలంకారం)

శీర్షిక: *నా ప్రేయసి సుకుమారి*

నా ప్రేయసి సుకుమారి  *ముఖం జాబిలి వలె గుండ్రంగాను* 

ఆమె *కనురెప్పలు హంస రెక్కల వలె చురుకుగా* 

సుకుమారి *ఎత్తు వామనుడి వలె కురుచగా* 

ఆమె *నుదుట బొట్టు ఉదయించే సూర్యుడిలా ఎర్రగా పెద్దగా* ఉంది

 

ఆహా ! ప్రేయసి *చూపులు చురకత్తుల వలే పదునుగా* 

సుకుమారి *కురులు కారు మబ్బుల వోలె నల్లగా* 

ఆమె *జడ నాగు పాము వలె పొడుగుగా* 

నా ప్రేయసి *లేలేత బుగ్గలు కోవా లడ్డూల వలె సుతిమెత్తగా* ఉన్నాయి 


సుకుమారి *ముక్కు మోట బావి వలె పొడుగ్గా* 

ఆమె *పళ్ళు వెండి తీగల వలె తళతళా మెరిసి పోయే*

సుకుమారి *చీర లేత పచ్చని రామచిలుక వలే సుందరంగాను* 

ఆమె *రవికే సీతాకోకచిలుక వలె రంగు రంగులతో ఇంద్ర ధనుస్సులా* ఉంది 


ఆమె *నడుము తామర తూడుల వలె సన్నగా* 

నా సుకుమారి *వక్షోజాలు నిండు పాలు కుండల వలె నిగనిగ లాడుతూ* 

నా చెలి *ఆహార్యం కుందనపు బొమ్మ వలె అందంగా* 

ఆమె *మెడలో వైడూర్యాల హారం శివుని మెడలోని సర్పం వలె మనోహరంగా* ఉంది 


నడుస్తుంటే నా ప్రేయసి  *కాళ్ళ గజ్జెలు నాట్యమయూరి వలె గల్లు గల్లు మంటూ*

నా సుకుమారి *మనసు వెన్న పూస వలె సుకుమారంగా* 

ఆమె *హృదయం అమృతం వలె హృద్యంగా* ఉంది 


        

వివాహం విడాకులు పిల్లలు

*నేటి అంశం* *వివాహాలు*విడాకులు*

*-పిల్లలు*

శీర్షిక: *వివాహ బంధం పవిత్రమైనది*

*పెళ్ళంటే నూరేళ్ళ పంట*
*అది నిలవాలి కలకాలం మన ఇంట*
వివాహం జీవితంలో ఒక భాగం
అంతే గానీ వివాహమే జీవితం కాకూడదు!

*నీటిలో పడప ప్రయాణించాలి గానీ*
*పడవలోకి నీరు చేరకూడదు*
వధూవరుల మనసులు కలిసినా
తనువులు కలువక పోవచ్చు
యువతీయువకుల తనువులు కలిసినా
మనసులు కలువక పోవచ్చు
*మనిషికి తన చేతి ఐదు వ్రేళ్ళే*
*సమానంగా ఉండవు*
అలాంటిది ఎవరో అవతలి వారి
మనసులు తనువులు ఒకేలా ఉంటాయని
అనుకోవడం అమాయకత్వం అత్యాశే!

కాలక్రమేణా జీవితంలో ఆర్ధిక , కుటుంబ
ఆరోగ్య మానసిక సమస్యలు
కందిరీగల వలె చుట్టు ముడుతాయి
వారిలో వారే సర్దుబాటు చేసుకుంటే సంసారం
బయట పడితే వారు సమాజానికి ఫలహారం!

నేనే గొప్ప అనుకుంటే అహంకారం
మనమే గొప్ప అనుకుంటే మమకారం
ఒకరికొకరం తోడు అనుకుంటే సహకారం
ఎవరికీ ఎవరం కాదనుకుంటే నిర్వికారం
రేపు అదే అవుతుంది విడాకులకు సోపానం!

*ఆవులు గేదెలు పోట్లాడుకుంటే*
*దూడల కాళ్ళు విరిగినట్లు*
భార్యాభర్తలు పోట్లాడుకుంటే
విడాకులు తీసుకుంటే  పిల్లల జీవితాలు
అగమ్యగోచరాలు సమాజంలో అనాధబాలలు
వారే అవుతారు రేపు అసంఘటితశక్తులు

భారత దేశంలో వివాహ బంధం పవిత్రమైనది
దానిని నిలబెట్టాల్సిన భాద్యత అందరిపై ఉంది
తల్లి తండ్రుల పిల్లలకు కొంత స్వేచ్ఛ నివ్వాలి
పెళ్ళి చేసుకోబోయే ముందే అందం డబ్బు
హోదా కాకుండా మనసు తనువు చూడాలి
జీవితం ఎవరిదీ నల్లేరుపై నడక కాదు
పూర్వ జన్మ పునర్జన్మ కర్మ ప్రభావాలు
గ్రహాల ప్రభావాలు అందరిపై ఉంటాయి
వివాహం అయ్యాక సహనంతో సర్దుబాటు
చేసుకుంటూ *ముళ్ళతో కూడిన గులాబీలు*
*ఎలా పరిమళాలను వెదజల్లుతాయో*
అలా జీవితాన్ని గడుపుతూ ఆదర్శంగా జీవించాలి

          

Friday, March 28, 2025

ఇదేనా కవుల ఆశయం

అంశం: ఆశయం 


శీర్శిక::ఇదేనా కవుల ఆశయం? 


ఇదేనా కవులు చెప్పదలుచుకున్నది?

ఇదేనా కవుల ఆశయం?

ఇదేనా కవులకు సంతృప్తి , ముక్తి?

ప్రశంసా పత్రాలకో , పురస్కారాలకో

బిరుదులకో, మెప్పులకోసరమేనా రచనలు

ఎత్తుగడలు, ముగింపులు, అలంకారాలు ,పదబంధాలు , యతిప్రాసలేనా

ఎప్పుడు మారుతాయి మన బ్రతుకులు?

ఎప్పుడు మారుతుంది భారత దేశం, అభివృద్ధి చెందిన దేశంగా?

పేదలు బిక్షగాళ్ళవుతున్నారు

ధనికులు కుబేరులవుతున్నారు

మధ్య తరగతి వారు విల విల లాడుతున్నారు


నేడు రాష్ట్రాలలో , దేశంలో

అన్యాయాలు , అక్రమాలు తాండవిస్తున్నాయి

బానీసలను చేసే ఉచిత పధకాలు

పెరిగి పోతున్నాయి

ప్రజలను సోమరులను చేస్తున్నారు


ప్రజలపై ఉక్కుపాదం మోపుతున్నారు

నేతలు , వారి తొత్తులైన వ్యాపారులు

రాష్ట్రాలలో అప్పులు పెంచుకుంటూ

ఓటు బ్యాంకు పధకాలకు ,

వారి ఉనికి కొరకు ఖర్చు పెడుతున్నారు


కులాలను , మతాలను విడదీసి

బంధు పధకాలు , రిజర్వేషన్లు 

ఓటు బ్యాంకు కొరకు ప్రకటిస్తున్నారు

కాకమ్మ కథలు చెప్పి దేశ సంపదను

దోచుకుంటున్నారు


ప్రశ్నించే వారిని వేరు వేరు

కేసులతో హింసిస్తున్నారు

ఏ ఒక్కరు ఏమీ చేయలేరు

నేడు సామాన్యులకు

అనుకూల పవనాలు వీస్తున్నాయి

సర్వోన్నత న్యాయస్థానం

చక్కని నిర్ణయాలు తీసుకుంటున్నది

ఇక కదలండి ,కదిలించండి మీ మీ కలాలను


వ్యవస్థలను చైతన్య పరుచాలి

ఎన్నికల సంస్కరణలు జరుగాలి

ఓటు బ్యాంక్ పధకాల నియంత్రించాలి

రిజర్వేషన్ల క్రమ బద్దీకరించాలి


హామీలపై నియంత్రణ ఉండాలి

నేతలకు పెన్సన్లు రద్దు చేయాలి

నేతలకు ఆదాయ పన్నులు వేయాలి

భూస్వాములకు రైతు బంధు రద్దు చేయాలి

రైతన్నలను జీవింప చేయాలి

కర్షక కౌలుదారుల శ్రమను గుర్తించాలి


కాళోజి అన్నట్లు  ఒక్క సిరా చుక్క 

వేయిమెదళ్ళను కదిలించాలి

కవుల ఆశయం ప్రజల చైతన్యం చేసే 

దిశగా అడుగులు వేయాలి!


తరువమ్మా చెరువమ్మా

అంశం: తరువమ్మా చెరువమ్మా


శీర్షిక: తరువమ్మా చెరువమ్మా!


తరువమ్మా చెరువమ్మా 

మము కాపాడే దేవతలమ్మా

ఆటపాటలకు ఆలవాలము 

ఆనందాలకు నిలయము 

పాదచారులకు స్వర్గధామము

తరువమ్మా చెరువమ్మా

జీవకోటికి ప్రాణదాతలు మీరమ్మా!


దూపను తీర్చేను చెరువమ్మా 

నీడ నిచ్చేను తరువమ్మా 

కడుపు నింపేను చెరువమ్మా 

సేద తీర్చేను తరువమ్మా 

తరువమ్మా చెరువమ్మా

జీవకోటికి ప్రాణదాతలు మీరమ్మా!


తరువుల వలనే గాలులు వీచును

గాలుల వలనే వానలు కురియును 

వానల వలెనే చెరువులు నిండును 

చెరువుల వలనే పంటలు పండును 

చెరువుల వలనే తరువులు 

పెరుగును

తరువమ్మా చెరువమ్మా 

జీవకోటికి ప్రాణదాతలు మీరమ్మా!


తరువులు ఇచ్చు పండ్ల ఫలాలు 

చెరువులు ఇచ్చు చేపలు దుంపలు 

తరువుల పైన పక్షుల కిచకిచలు 

చెరువుల లోన కప్పల బెకబెకలు 

తరువమ్మా చెరువమ్మా 

మము కాపాడే దేవతలమ్మా

జీవకోటికి ప్రాణదాతలు మీరమ్మా!


   

మహా గణపతి

అంశం: *మై సెల్ఫీ*

శీర్షిక: *విజ్ఞానాలకు అధిపతి గణపతి*

*విఘ్నాల విరోధి యజ్ఞాల రథసారథి*
*తల్లి మాటను జవదాటని వారు, తండ్రినే*
*ఎదిరించి ప్రాణాలను త్యధించిన వారు*
*ఈశ్వరుని జ్యేష్ట పుత్రుడు*
*సమస్త భక్తులతో పూజలందుకునేవారు ఒక్కరే*
*వారే వారే మహాగణపతి దేవుడు*

పూజ ఆరంభించాలన్నా
మీటింగ్ ప్రారంభించాలన్నా
పెళ్ళి పనులు  మొదలు పెట్టాలన్నా
వివాహములు  జరిపించాలన్నా
ఎలాంటి విఘ్నాలు జరుగ కూడదన్నా!

చదువు బాగా రావాలన్నా
బజారుకు బయలు దేరాలన్నా
ఆపదలనుండి గట్టెక్కాలన్నా
మంచి కార్యాలకు ప్రయాణమైనా!

మనసు ప్రశాంతంగా ఉండాలన్నా
మొరపెట్టుకునేది గణనాధుడికే
తలిచేది ముందుగా విఘ్నేశ్వరుడినే
పూజించేది ముందుగా గణేశుడినే!

నమ్మిన బంటు ఎవరంటే గుర్తుకు వచ్చేది
తండ్రినే ఎదిరించిన వినాయకుడే
తెలివిగా ఆపదల నుండి గట్టెక్కే వారెవరంటే
కుమారస్వామిని గెలిచిన గణేశుడే!

కుల మతాల భేదం లేకుండా
పేద ధనిక భేదం లేకుండా
ప్రాంతాల తారతమ్యం లేకుండా
విగ్రహాలు పెట్టుకుని నవరాత్రులు!

అంగ రంగ వైభవంగా ప్రతియేటా
బాధ్రపద మాస శుక్లపక్ష చవితి నుండి
తొమ్మిది దినములు పూజలు జరిగేది
పండుగల్లా ఉత్సవాలు జరిపుకునేది
చివరి రోజు గణపతి పూజల లడ్డూలను
వేలు లక్షలకు కోలా హలంగా వేలం వేసేది
విగ్రహాలను నదులలో ,కొలనులలో
నిమజ్జనం చేసేది బొజ్జగణపతినే కదా!

గణేషుడంటే ప్రజలకు ఒక దైవం
గణపతి అంటే ప్రజలకు ఒక నమ్మకం
వినాయకుడంటే భక్తులకు ప్రాణం
విఘ్నేశ్వరుడంటే జనులకు సర్వస్వం
ఇంతకంటే గొప్పేమి కావాలి గణనాథునికి!








విశ్వావసు ఉగాది

శీర్షిక:విశ్వావసు ఉగాది


01.
సీ.ప:
యేడాది కొకసారి యెండ కాలమునందు
కోకిలమ్మతో వచ్చె నేకముగను
విశ్వావసు నుగాది విశ్వాసమునుబెంచ
షడ్రుచులను తెచ్చె చక్కగాను
కష్ట సుఖములన్ని యిష్టమవ్వాలని
తీపి వగరు చేదు వేపపువ్వు
ఆరురచుల తోడ నర్ధము గావించె
తీరొక్క బక్షాల తియ్యదనము
చిన్నలు పెద్దలు సేవించ పచ్చడి
ఆరోగ్యమును నిచ్చు హాయిగుండు!

02:
ఆ.వె:
కొత్త కుండ లోన కొలువైన తీర్ధమున్
ఇష్టముగును తాగు తిష్ట వేసి
బంధు మిత్రులకును బాటసారులకును
నోరు తీపి జేయు నూరకున్న!

03:
ఆ.వె:
ఆరు రుచులు నెటుల వేరువేరు గుణముల్
కలిగి కరిగి యుండు సలిలమందు
మనుషుల సుగుణములు మహిలోన వేరైన
కలిసి మెలిసి యుంద్రు కాంక్ష తోడ!
 

Thursday, March 27, 2025

నందమూరి తారక రామారావు

అంశం: *విశ్వ విఖ్యాత నట సార్వభౌమ , పద్మశ్రీ డా. నందమూరి తారక రామారావు* 


శీర్షిక: *నగ్న సత్యం*


అతని మనసు ఉన్నతం 

అతని ఆశయం మహోన్నతం 

అతనొక మహోన్నత శిఖరం

తెలుగింటి వారి ఆత్మ గౌరవం!


కృష్ణా జిల్లా నిమ్మకూరులో జననం

తెలుగు ప్రజల ఆశా కిరణం 

బడుగు బలహీనుల ఆభరణం

తీర్చుకోలేరెవ్వరు మీ ఋణం!


చిన్న చిన్న వేషాలతో 

స్టేజి నాటకాలతో 

నటన వృత్తిని ప్రారంభించి 

వేలాది సినిమాలను

విభిన్న పాత్రలలో నటించి 

లక్షలాది అభిమానుల

అభిమానమును చూరగొన్న 

ఆత్మీయ నటశేఖరుడు

నందమూరి తారక రామారావు!


తెలుగు బిడ్డగా తెలుగు ప్రజల 

బడుగు జీవుల వెతలను, 

ఆర్ధిక స్థితి గతులను అర్ధం చేసుకున్న 

నవరస నటనా సార్వభౌముడు

రాజకీయ నాయకుడిగా అవతారమెత్తారు!


తెలుగు దేశం పార్టీని స్థాపించి 

అనతి కాలంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 

ముఖ్యమంత్రిగా ఎన్నికై 

పేద మధ్యతరగతి ప్రజల కొరకు 

ఎన్నో మరెన్నో  సంక్షేమ పధకాలను 

రచించి అమలు చేసిన ధీరుడు

రామరాజ్యాన్ని స్థాపించాలని 

తపించి పోయిన ధీన జనుల

ఆరాధ్య దైవం ఎన్టీ రామారావు!


రూపాయికి కిలో బియ్యం

ఉచిత విద్య ఉచిత వైద్యం 

పెన్షన్ పెంపు వంటి పధకాలు

ఆడపడుచులకు ఆస్తి హక్కు 

పేదబడుగులకు గృహ నిర్మాణం

నిరుద్యోగులకు ఉపాధి కల్పన 

ఇలా ఎన్నో పధకాలను ప్రకటిస్తూ 

సునాయాసంగా అమలు చేసారు!


దేశంలో ప్రపంచంలో

గొప్ప కీర్తిని గడించారు 

నటనా ప్రతిభను కనబరిచి 

విశ్వవిఖ్యాత నట సార్వభౌముడుగా

గుర్తింపు పొంది , కేంద్ర ప్రభుత్వం నుండి

*పద్మశ్రీ అవార్డు* ను , కళా ప్రపూర్ణగా 

పేరుగాంచి, ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి

*డాక్టరేట్ బిరుదు* ను పొందిన ఘనుడు 

మహోన్నత శిఖరం ఎన్టీ రామారావు!


అతి సులభంగా భారత ప్రధాన మంత్రి 

కావల్సిన సమయంలో 

స్వయంకృపారాధం  కారణమో

ఆత్మీయులే ప్రక్కలో బల్లెం కావడమో

దగ్గరి బంధువులే వెన్నుపోటు పొడవడమో

లేక విధి రాతనో తెలియదు గానీ 

దేశ ప్రజలు ఒక ఉత్తమ నటుడిని

ఒక ఉత్తమోత్తమ నాయకుడిని

కోల్పోవల్సిన దుస్థితి ఏర్పడింది

ఇది చరిత్ర మరువని నగ్నం సత్యం!

       

        

సీ.ప: ఆదర్శనీయుడు రాముడు

 శీర్షిక: ఆదర్శనీయుడు 

సీ.ప:

ధర్మరక్షణ జేయ ధరణిన జన్మించి

తండ్రిమాటనెపుడు దాటకుండ 

తల్లిపై కోపము తలచక రాముడు 

అడవుల కేగెను గడప దాటి 

అన్నను లక్ష్మణ ననుసరించియు తాను 

ఆదర్శముగ నిల్చె నగ్రజుడికి 

ఆలియు సీతమ్మ నడవికి వెడలెను 

భార్యభర్తల రాగ బంధమెరిగి 

ఆ.వె:

తండ్రికితగు గొప్ప తనయుడుగను రామ 

ఏకపత్నిగ నిల నిగ్రహముగ 

ధర్మ యుద్దములను దండిగ చేసిరి 

జనుల నిండు మనసు ఘనము పొందె 



మార్పు పాలకులలో రావాలి

శీర్షిక: *మార్పు పాలకులలో రావాలి*

(ఏడు దశాబ్దాలు దాటిన గణతంత్ర దినోత్సవం సందర్భంగా)

*పుండు ఒక చోట ఉంటే* 

*మందొక చోట పెట్టిన ఫలితం శూన్యం* 

ప్రజలలో కాదు మార్పు, పాలకులలో రావాలి

సంఘాలలో కాదు మార్పు, చట్టాలలో రావాలి

చట్టాలలోనే కాదు మార్పు, వాటిని అమలు చేసేటి  సమర్ధులు (టి.ఎన్. శేషన్ )  రావాలి

పది మంది పలురకాల చెడుతనంతో పోటీ చేసే అవకాశం చట్టాలలో ఉన్నపుడు

ప్రజలు ఓటు వేసినా వేయక పోయినా ఒకరు గెలుస్తారు

గుడులలో కాదుమార్పు,  బడులలో రావాలి

సలహాలలో కాదు, మార్పు చదువులలో రావాలి

ఆకాశంలో మేఘాలు ఎన్ని యున్నను ఏమి ఫలం

నేల పైన వర్షం ధారగా పడినపుడే ధరణి సస్యశ్యామలం

వేదిక పైన నిలబడి గొప్పలెన్ని చెప్పి ఏమి లాభం

ఉత్తర ప్రగల్పాలు గాకుండా చూడటం ఉన్నతం

అన్నీ ఉచితమని ప్రజలను బానిసలను చేయడం కాదు

ఉచితంగా దేశాన్ని దోచుకోవడం, క్విడ్ ప్రో

 ఆపేయాలి

ఓటు బ్యాంకు కొరకు నగదు పధకాలను పంచడం కాదు

అప్పులతో దేశాన్ని ముంచెత్తడం మానేయాలి

రాజకీయాలలో లేనపుడు సూచనలు ఏమి ప్రయోజనం 

రాజకీయ పదవులలో ఉన్నపుడు అమలు పరిచినపుడే సమాజానికి ప్రయోజనం

చనిపోయే వరకు రాజకీయాలు చేయడం కాదు

బ్రతికి ఉన్నపుడే గౌరవాలు , పురస్కారాలు , బిరుదులు అందించాలి

మొక్కకు నీరు పోసినపుడే , అది వృక్షమై ఫలాల నందిస్తుంది

విద్యార్ధులకు ఉచిత కూడు గూడు గుడ్డ విద్య వైద్యం అందించినపుడే , దేశానికి సేవ చేస్తాడు

పేద మధ్య తరగతుల వారిని ఎంత కాలం మోసం చేస్తారు?

సానుభూతి సలహాలతో అధికార పీఠాల ఇంకెంత కాలం పట్టకుని వ్రేళ్ళాడుతారు?

ప్రశ్నించే ప్రజల నోరు నొక్కేయడం కాదు

ప్రశ్నించే భావాలనర్ధం చేసుకుని సరిదిద్దుకోవాలి

నీతులు వల్లించడమే కాదు

ధర్మంగా అడిగే వారికి అండగా నిలువాలి

అధికారంలో ఉన్న దేశభక్తులు ఉచిత సలహాలివ్వడం కాదు

ఉన్న చట్టాలనే అమలు పరుచడానికి కృషి చేయాలి


విజయం తధ్యం

అంశం: వెనక్కి తిరిగిన క్షణం



శీర్శిక: *విజయం తధ్యం*

రోడ్ మీద మన ముందు ఎంతో
ట్రాఫిక్ కనబడినా
భయపడి ప్రయాణాన్ని ఆపం!

ఎంట్రెన్స్ పరీక్షలకు విద్యార్థులు
వేలాది మంది హాజరైనా
పరీక్ష వ్రాయడం ఆపం!

ఉద్యోగాలకు లక్షలాది మంది
అప్లై చేసినా
పరీక్షలకు చదవడం మానం
వ్రాయడం మానం!

విమాన యానం అంతరిక్ష యానం
క్షణం అటుఇటు అవుతే
ప్రాణాలు దక్కవని తెలుసు
అయినా ప్రయాణం ఆపం!

వ్యాపారం చేసినా షేర్ మార్కెట్ లో
ఇన్వెష్ట్ చేస్తే నష్టాలు వచ్చేది తెలియదు
లాభాలు వచ్చేది తెలియదు
అయినా ఇన్వెష్ట్ చేస్తానే ఉంటాం!

ఎందుకంటే పదివేల అడుగుల
ప్రయాణానికైనా మొదటి అడుగే ప్రధానం!

అడుగు వేయకుండా భయపడి
*ఒక్క క్షణం వెనక్కి తిరిగావో*
ఒక్క అడుగు వెనక్కి వేశావో
ఇక ముందుకు సాగలేవు
జీవితం *ఎక్కడ వేసిన గొంగళి అక్కడే*
అన్నట్లుగా  ఉంటుంది!

*ధైర్యే సాహాసి లక్ష్మి* అన్నారు పెద్దలు
అలానే *కృషితో నాస్తి దుర్భిక్షం* అన్నారు

ఒక్క క్షణం కూడా వెనక్కి తిరుగకుండా
పట్టుదలతో, దృడమైన సంకల్పంతో
స్కిల్స్ మెరుగు పరుచుకుంటూ
తప్పులను సరిదిద్దుకుంటూ
అనుభవాలను నెమరు వేసుకుంటూ
అనుభవజ్ఞులు సలహాలు తీసుకుంటూ
ధైర్యంగా ముందుకు వెళ్ళినను
ఇక పోటీ అంటూ ఎవరూ ఉండరు
*విజయం తధ్యం!*

        

రాలిన పూల వాసనలు

అంశం: రాలిన పూల వాసనలు


శీర్షిక: *బురుదలో పుట్టిన కమలాలైనా*

బురుదలో పుట్టిన కమలాలైనా
చిటారు కొమ్మలో విరిసిన బొడ్డు మల్లెలైనా
తోటలో పూసిన గులాబీలైనా
లతలకు మెరిసిన సన్న జాజి సిరులైనా
తాజాగున్న కాలంలోనే పరిమళాలు
సుగంధ మకరందాలు వెదజల్లుతాయి
దైవం పాదాల చెంత చోటు నొందుతాయి
తరుణిల తలలలో స్థానం పొందుతాయి!

మట్టిలో మెరిసిన మానిక్యాలైన మేధావులు
పూరి గుడిసెలలో మొగ్గ తొడిగిన మనుషులు
రాజకీయ కుటుంబాలలో పుట్టిన నాయకులు
మధ్య తరగతి కుటుంబాలలో జన్మించిన మహానుభావులు
ఎన్నో సేవలు గొప్ప పనులు దానాలు చేసి
బ్రతికున్న కాలంలో పేరు ప్రతిష్టలు
పొందుతారు విశ్వఖ్యాతి పొంది యుంటారు

పూవుల జీవిత కాలం ఒకటి రెండు రోజులైతే
మానవుల జీవిత కాలం తొంబై నుండి నూరు
సంవత్సరాలు

రాలిన పూల వాసనలైనా
గతించిన మానవుల అనుభవాలైనా
అవి పండుటాకుల్లా ఎండుటాకుల్లా
వృధా కావు ఎప్పటికీ
మనుషులు వారు చూసే ద్రుష్టిని బట్టి
మారుతూ ఉంటుంది!

రాలిన పూలనుండి సెంటు అత్తరు
సుగంధ పరిమళ తైలం తీయవచ్చు
గతించిన మనుషుల నుండి
వారి ఆలోచనలను అనుభవాలను
వారు రచించిన గ్రంథాల నుండి జ్ఞానాన్ని
పొందవచ్చు
వారిని ఆదర్శంగా తీసుకుని మెరుగైన
జీవితాలను గడుపవచ్చ!

అవయవదానం

*నేటి అంశం*అవయవదానం*


శీర్షిక: దానాలలో కెల్ల అవయవదానం గొప్పది

*అన్నదానం మనిషికి*
*ఒక పూట కడుపునింపుతే*
*అవయవ దానం మనిషికి*
*పునర్జన్మ నిస్తుంది*

జగతి లోన జీవకోటికి లేనిది
మనిషి జన్మ కుంది  గొప్ప వరం
మనుషులకు వీలైనది అనువైనది
పది మందికి దానం చేయగల అవకాశం
అదియే *అవయవదాన* సదవకాశం!

భూదానం గోదానం విద్యాదానం
అన్నదానం అవయవదానం మరెన్నో
దానములకెల్ల *అవయవదానం* గొప్పది
అది జగమెరిగిన సత్యం!

కలకాలం ఎవరూ భూమిపైన బ్రతకరాలేదు
జన్మతోనే ఎవరూ ధనవంతులు కాదు
పుట్టుకతోనే ఆరోగ్య వంతులు కాదు
అన్ని అవయవాలతో జన్మించక పోవచ్చు!

మనిషిగా పుట్టినపుడు మానవత్వం
తోటి వారికి సహాయం చేయ గల గుణం
ఆపదలో ఉన్న వారిని ఆదుకునే తత్వం
ఉన్నపుడే  మనిషి జీవితం ధన్యం!

సేవలు ఆర్ధిక సహాయాలు ఇతర దానాలు
మనిషి బ్రతికి ఉండగా చేసేవి
తోటి వ్యక్తి బాధలో ఉన్నప్పుడు ఆదుకునేవి
మనిషి చనిపోయాక చేసేది *అవయవదానం*!

అవయవదానాలు అనేకం
నేత్ర దానం కిడ్నీ దానం లివర్ దానం
రక్త దానం సెల్స్ దానం మరెన్నో
*అవయవ దానం మనిషికి*
*పునర్జన్మ నిస్తుంది*

ఓ.. ప్రేయసీ

అంశం: ట్యూన్ లిరిక్స్


శీర్షిక: *ఓ.. ప్రేయసీ..*

పల్లవి:
అతడు:
ఓ..ఓ..ఓ..ఓ.. ప్రేయసీ...
అందాల నా మానసీ...
అనురాగ దీపికా...
అపరంజి బొమ్మవే....
ఓ.. ఓ...ఓ...ఓ..ప్రేయసీ...
నిను చూడ కుండ ఉండ లేనే...
నా మనసులోన నీవేనే..
నా.. కలలోనూ నీవేనే....                  "ఓ..ఓ..ఓ.."

చరణం:01
అతడు:
ఓ..ఓ..ఓ...ఓ... ప్రేయసీ...
ఒకసారి ఇటు చూడవే..
నా మది నిండా నీవేనే...
నా మధుర మధులతవే ....
నను అల్లుకుని పోవే....                "ఓ..ఓ..ఓ.."

చరణం:02
ఓ..సుందర మధనా ..
ఓ.. మంద గమనా..
నా వీణవు నీవే ...
నా పాటవు నీవే...
నా రాగం నీవే...
నా పల్లవి నీవే...                             "ఓ..ఓ..ఓ.."

చరణం:03
అతడు:
ఓ.. కోమలాంగీ..
ఓ.. నీవు లేక నేను లేనే...
నేను లేక నీవు లేవే...
నాలో సగం భాగమే...
నా హృదయం నిండా నీవేనే...
నిన్ను వీడి ఉండ లేనే...                   "ఓ..ఓ..ఓ.."

    

Wednesday, March 26, 2025

నీవు నేను ఓ చల్లని సాయంత్రం

అంశం: నీవు నేను ఓ చల్లని సాయంత్రం


శీర్షిక: *గల గలా గోదావరి*

నీవు నేను ఓ చల్లని సాయంత్రం
అదిగదిగో వెలుగులతో రామాలయం
గుడిలో వినిపిస్తుంది పూజారి మంత్రం
తీసుకు వెల్దాం పుష్పం తోయం పత్రం!

చూద్దామా గల గలా పారే గోదావరి
అదిగో గోదావరి మీదనే బస్సులు వెళ్ళే దారి
మోటారు సైకిళ్లు వెలుతాయి సందులో దూరి
గోదావరి లోకి రోజూ వెలుతాడు జాలారి!

గోదావరిలోకి దిగడానికి ఉంటుంది మెట్లదారి
స్నానాలు చేస్తారు గోదావరి చేరి
పిల్లలు ఈత కొడుతారు అందులో దూరి
పూజలు చేస్తారు అయ్యవార్లు చేరి!

మంత్రాలను చదువుతారు హోరా హోరి
పూజా సామాగ్రి కొనమంటారు మరీమరి
గోదావరి కట్ట క్రిందనే సన్నని మోరి
చెత్తాచెదారం ఉంటుంది అందులో చేరి!

గోదావరి కట్ట ప్రక్కనే హోటల్లో పూరి
డబ్బు చెల్లిస్తుంటే గుర్తు కొస్తాడు హరి
నది ప్రక్కనే రైతులు పండిస్తారు వరి
బియ్యం తీస్తారు రైతులు వడ్లను నూరి

బహుళ ప్రయోజనకారి  గోదావరి
గోదావరి ముగుస్తుంది సముద్రంలో చేరి
ఎలావుంది నీవు నేను ఓ చల్లని సాయంత్రం
మెల్లమెల్లగా ఇక వెళ్దామా ఇంటికి మరి!

        
        

నీకు నీవే ధైర్యంగా ఉండాలి

అంశం:ధైర్య దీపిక


శీర్శిక: *నీకు నీవే ధైర్యంగా ఉండాలి*

చెక్కరను తినాలని
చీమలు చూస్తాయి!

విత్తనాలను తినాలని
పక్షులు చూస్తాయి!

మొలకలు తినాలని
పశువులు చూస్తాయి!

మొక్కలని తినాలని
జంతువులు చూస్తాయి!

అన్నీ తప్పించుకుని
ఆ విత్తనం వృక్షమైనప్పుడు!

చీమలు పక్షులు జంతువులు పశువులు
ఆ చెట్టు క్రిందకే నీడ కోసం వస్తాయి!

మనిషి జీవితం కూడా అంతే
సమయం వచ్చే వరకు వేచి ఉండాల్సిందే
దానికి కావలసినది సహనం మాత్రమే!

జీవితంలో నిన్ను విడిచి వెళ్ళిన
వారి గురించి ఆలోచించకు!

భూమి మీద ఇంకా ఉన్న వాళ్ళు
శాశ్వతం అని భావించకు!

ఎవరో వచ్చి నీ గోడును
అర్ధం చేసుకుంటారని తలచకు!

ఎవరో వచ్చి నీ బాధను ఆర్ధంచేసుకుని
నీకు సహాయం చేస్తారని కలలు కనకు!

*నీకు నీవే ధైర్యంగా ఉండాలి*
నీకు నీవే తోడుగా నిలబడాలి!

తెలంగాణా బతుకమ్మ పాట

 *తెలంగాణా బతుకమ్మ పాట*

*********************


బతుకూ బతుకూల బొమ్మ , బంగారు  ముద్దుల గుమ్మ 

మా  భూములన్నీ దోచే నమ్మో , ఈ పేట లోన  "2"                                      "బతుకూ "


మొండీ ధైర్యంతో మోహిని, కారులోన పోతుంటే

నేతలూ  చుట్టూ ముట్టే నమ్మో , ఈ పేట లోన  "2"                                  "బతుకూ " 


పరుగో పరుగున పారణి , సమ్మెలకూ పోతే

పోలీసులు చుట్టూ ముట్టే నమ్మో , ఈ పేట లోన "2"                               "బతుకూ " 


నోరూ వాటంతో రాగిణి , ధరణీ  క్షేత్రం పొతే 

మీడియా చుట్టూ ముట్టే నమ్మో , ఈ పేట లోన   "2"                             "బతుకూ " 


కట్టూ కథలతో కాలిని , కోర్టూ కు పోతే 

లాయర్లు చుట్టూ ముట్టే నమ్మో , ఈ పేట లోన   "2"                             "బతుకూ "

గిడుగు గొడుగు

శీర్షిక: *గిడుగు "తెలుగు వాడుక భాష" గొడుగు*

(ప్రక్రియ: మణిపూసలు

రూపకర్త: వడిచర్ల సత్యం)


సమైక్యాంధ్రప్రదేశ్ లో

పర్వాతాల పేటలో

జన్మించినాడుగిడుగు

ఒక చిన్న గ్రామంలో


మహాన్నత పండితులు

గొప్ప ఉపాధ్యాయులు

బహుభాషా కోవిదుడు

మంచి అనువాదకులు


వాడుక తెలుగు పిడుగు

తెలుగు భాషా గొడుగు

మాతృభాష ఉన్నతికై

వేసెను ముందు అడుగు


ఆధునిక తెలుగుకు, స్పూర్తి

పిడుగు గిడుగు రామమూర్తి

రావు సాహెబ్ బిరుదుతో 

పొందెనెంతో ఘణ కీర్తి


తెలుగు భాష దినోత్సవము

గిడుగు వారి జన్మదినము

తెలుగువారెందరికో

గొప్పస్పూర్తి దాయకము


సంస్కృతమను భాషను

వ్యవహారికం లోను

మార్చెను సరళము గాను

తెలుగులోకి భాషను


బాష సంస్కరణయోధుడు

చిరశ్మరణీయధీరుడు

కళా ప్రపూర్ణ బిరుదుతో

తెలుగుకు వన్నెతెచ్చాడు


భాషోధ్యమకారులు

భాషాపితామహులు

వాడుక భాషను శ్వాసగ

భావించిన పుణ్యులు


కమ్మనైన అమ్మభాష

తీయనైన తెలుగు భాష

ఆది కవి నన్నయచే

ప్రారంభించినది భాష


తేనెలొలుకు తెలుగు భాష

వీనులవిందైన భాష

పెరుగు అన్నము లాంటి

పసందైన తెలుగు భాష


తెలుగు మన మాతృ భాష

అమృతంబు లాంటి భాష

అన్య భాషలలో కెల్ల

ఉత్కృష్టమైన భాష


కవి తిక్కన్న చేతిలో

అన్నమయ్యకీర్తనలో

వెలుగులు చిమ్మే తెలుగు

వేమన ఆటవెలదిలో


భావవ్యక్తీకరణకు

జ్ఞానమును ఆర్జించుటకు

అనేక, వ్యవహారాల

పరిష్కారము చూపుటకు


మాతృభాషను నిలుపాలి

పాలనలోన వాడాలి

వ్యవహారాలన్నియూ

తెలుగుభాషై ఉండాలి


యువకులు ఏకమవ్వాలి

ఉపాధ్యాయులు కదలాలి

కవులు అందరూ కలసి

తెలుగునూ రక్షించాలి

బలం బలహీనత

 అంశం: బలం బలహీనత


మొసలి
నీటిలో ఉన్నంత వరకు
బలమైనదే
ఒడ్డున పడ్డాక
బలహీనమే!

కొండ చిలువ
జంతువును మ్రింగే వరకు
బలమైనదే
జంతువును మ్రింగాక
బలహీనమే!

వృక్షం
నీరు ,నేల ,గాలి 
వెలుతురు ఉన్నంత వరకు
బలమైనదే
అవి లేని రోజు బలహీనమే!

మనిషి
డబ్బు , హోదా , 
ఆరోగ్యంగా ఉన్నంత వరకు
బలమైన వాడే
డబ్బు , హోదా 
ఆరోగ్యం పోయాక
బలహీనుడే!

పుష్టికర ఆహారం తింటే ఆరోగ్యం
జంకు ఫుడ్స్ తింటే అనారోగ్యం
ఆరోగ్యంగా ఉంటే ధైర్యం
అనారోగ్యంగా ఉంటే అధైర్యం
ధైర్యంగా ఉంటే బలం
ధైర్యంగా ఉంటే బలహీనం!

చదువు లేక పోవడం బలహీనత
సోమరిగా తిరగడం బలహీనత
సంపాదింలేక పోవడం బలహీనత
అబద్దమాడటం బలహీనత
దొంగ తనం చేయడం బలహీనత
మోసం చేయడం బలహీనత!

తప్పు చేస్తే బలహీనుడగు
ఆందంగా లేనని బలహీనుడగు
అంగవికలులమని బలహీనుడగు
ఉచితంగా ఏమి ఆశించిన బలహీనుడగు!

తన సామర్ధ్యం తెలుసుకోలేకున్నా బలహీనుడే
సమస్యలపై అవగాహన లేకున్నా బలహీనుడే
ఆత్మ విశ్వాసం లేక పోయినా బలహీనుడే
ఆత్మాభిమానం వదులు కున్నా బలహీనుడే
బలహీనుడైన వారు బానిసలుగా బ్రతకాల్సిందే!

మనిషి తన బలహీనతలను
అధిగమించిన రోజు
తన శక్తి సామర్ధ్యాలను గుర్తించిన రోజు
తనకంటే *బలమైన* వారు ఎవరు ఉండరు!


ఉక్కు మనిషి

 అంశం: *సర్దార్ వల్లభ్ బాయి పటేల్ వర్ధంతి సందర్భంగా*


(ప్రక్రియ: మణిపూసలు
రూపకర్త: శ్రీ వడిచర్ల సత్యం గారు

శీర్షిక: *ఉక్కు మనిషి*

01.
స్వాతంత్రసమరయోధుడు
కార్యదక్షతగలవాడు
భారత దేశములో
సంస్థానాల కలిపాడు

02.
గొప్ప నిజాయితీ పరుడు
గుండె ధైర్యం గలవాడు
ఉక్కుమనిషిగానిలన
ప్రజామోదం గలవాడు

03.
పటేల్ యొక్క జననము
నాడియార్ పట్టణము
అక్టోబర్ ముప్పైఒకటి
గుజరాత్ అను రాష్ట్రము

04.
జవేరిభాయి పటేల్
లాడ్ భాయి పటేల్
తల్లిదండ్రులు,ఇతడు 
వల్లభ భాయి పటేల్

05.
గొప్ప మేధావంతుడు
మంచి విద్యావంతుడు
ఇంగ్లాండ్ దేశంలో
భారిష్టర్ చదివాడు

06.
దేశమంటె మహా భక్తి
ప్రజలంటేను ఆసక్తి
కుయుక్తులేమీ తెలియవు
దేశభక్తి  గలవ్యక్తి!

07.
గొప్ప సాహితీ వేత్త
ఘనమైన తత్వ వేత్త
నరనరాల్లోనూ శక్తి
పటేలు ఉధ్యమ నేత!

08.
స్వాతంత్ర్యం కాలంలో 
క్లిష్టమైన సమయములో
కీలక పాత్ర పోషించె
జన సేవ చేయడంలో!

09.
ప్రజలకు సేవ చేశారు
లోకసభలో గెలిచారు
కేంద్ర రక్షణ మంత్రిగ
భాద్యతలు చేపట్టారు!

10.
దేశ భక్తి గలవాడు
దూరదృష్ఠి గలవాడు
గొడువలననుచుటలో
పరిపాలనా దక్షుడు!

11.
గొప్ప పరిశీలకుడు
మంచి విశ్లేషకుడు
ఉపరాష్ట్రపతిగానూ
సేవలందించాడు!

12.
మాటలలో తను చెప్పడు
చేతలలో చూపిస్తడు
స్థిత ప్రజ్ఞత గల పటేల్
*భారత రత్న* పొందాడు!

మనసా! ఓ మనసా!

అంశం: మనసా పలకవే


శీర్షిక: *మనసా! ఓ మనసా!*

మనసా! ఓ మనసా!   
ఏమిటి నీ ఆశయం ! ఎందాకా నీ పయణం!     
ఏమి తెచ్చావు ఈ లోకానికి !
ఏమి ఇచ్చావు ఈ జగతికి! 
ఏమి తీసుకెళ్తేవు రేపు నీ లోకానికి! 

ధనం సంపాదించినా  నీ తోడు రాదు
విద్య సంపాదించినా  నీ తోడు రాదు
సంతానాన్ని సంపాదించినా నీ తోడు రారు
అందాన్ని సంపాదించినా నీ తోడు రాదు
సుఖంగా జీవించింది నీ తోడు రాదు
మంచి మాట , మంచి మనసు
మంచి సహాయం మంచి దానం మంచితనం
నిను నింగిలో నిలుపు!   

అసహనంతో ఒక  కాగితాన్ని చించగలవు . కానీ  దానిని తిరిగి అతికించలేవు.
కోపంతో ఒక మాట అనగలవు . కానీ తిరిగి దానిని తీసుకోలేవు .
మూర్ఖంగా  ఒక దెబ్బ కొట్ట గలవు , కానీ తిరిగి దానిని మాన్ప లేవు
అహంకారంతో  ఎవరినైనా ఒక మాట అన గలవు . కానీ మరల ఆ మాటను తీసుకోలేవు!

మన కాళ్ళు చేతులే సహకరించవు కలకాలం
మన సంతానమే తోడు ఉండరు మనతో నిరంతరం
మన భాగస్వామియే దగ్గరకు రాలేరు శ్వాస విడిచాక
మన బంధువులే దరిదాపుల్లోకి రారెవ్వరు
మన ఆస్తులు అంతస్తులు ఏవీ మనతో రావు కైలాసానికి!
మనసా !ఓ మనసా ! ఏమిటీ నీ ఆశయం
ఎందాకా నీ పయణం!

Tuesday, March 25, 2025

పెరుగుట విరుగుట కొరకే

అంశం: *ఆర్టిఫిషియల్ ఇంటిలీజెన్స్*


శీర్షిక: *పెరుగుట విరుగుట కొరకే*

*సముద్ర కెరటం గగనమెత్తు ఎగిరినా*
*తిరిగి సముద్రంలో పడక మానదు*

*పెరుగుట విరుగుట కొరకే అన్నట్లు*

*టెక్నాలజీ ఎంత పెరిగినా*
*అది జనహితం కానిచో హిమమయమే!*

గ్లోబలైజేషన్, లిబరలైజేషన్
ప్రయివేటైజేషన్ కు అంకురార్పణ జరిగాక
ప్రపంచం ఒక కుగ్రామంగా మారింది
టెక్నాలజీ  అంచెలంచెలుగా విస్తరించి
కంప్యూటర్లు , చరవాణీలు రావడంతో
అరచేతిలోనే స్వర్గంలా ఒంటి వ్రేలుతో
చకచకా పనులు కదం తొక్కుతున్నాయి!

సంస్కారం నేర్పని చదువు ఎందుకు?
భారతీయ సంస్కృతి సంప్రదాయాలను
విస్మరించి జన్మనిచ్చిన తల్లిదండ్రులను
పోషించలేని సేవలు కర్మలు చేయలేని
విద్య అవసరమా? అనిపిస్తుంది ఒక్కోసారి!

నేడు పదిమంది శ్రామికులు చేసేపని
ఒక మెషీన్ పూర్తి చేస్తుండే
కార్మిక చట్టాలను తుంగలో తొక్కిరి
నిరుద్యోగ సమస్య పెరిగి పోతుండే
పనేది లేక ఉచిత డబ్బు కొరకు
ఆన్లైన్ మోసాలకు పునాది వేసిరి
అకౌంట్లలో డబ్బ ఖాలీ అవుతుండే!

ఇక ఇప్పుడు *ఆర్టిఫీషియల్ ఇంటిలీజెన్స్*
"కృత్రిమ మేధస్సు" మరమనుషుల రాకతో
ఉద్యోగులపై ముప్పేట దాడి
డబ్బుతో అహంకారం పెరిగి పోయే
చరవాణీలతో  జ్ఞాపకశక్తి అనారోగ్యం
విలువైన సమయం దెబ్బతినే
మానవ సంబంధాలు దూరమాయే
సహజీవనం వెసులుబాటుతో
వైవాహిక సంబంధాలు అయోమయం
పెళ్ళిళ్ళకు ఆసక్తి క్రమంగా తగ్గుముఖం!

ఇలాగే "కృత్రిమ మేధస్సు" వంటి
సాంకేతిక పరిజ్ఞానం పెరిగి పోతే
రేపు మర మనుషులు విస్తరిస్తే
మనుషులు చేసే పనులన్నీ రోబోలే చేస్తే
మానవుల రాస క్రీడలు రోబోలే తీరుస్తే
ఇక బంధాలు అనుబంధాలు ఉష్ కాకే
జనులలో ప్రేమ దయ జాలి మృగ్యమే
వ్యాపార బంధాలకే పెద్ద పీట!

రోబోల కారణంగా కొన్ని వర్గాలలో
జనాభా తగ్గుముఖం పడితే
రాజీ పడని మరికొన్ని వర్గాలలో జనాభా
మెల్లమెల్లగా చాపకింద నీరులా విస్తరించి
ఆదిపత్య పోరుతో  ఒకరినొకరు
కొట్టుకోవడం చంపుకోవడంతో పాటు
మూడవ ప్రపంచ యుద్దానికి కూడా
దారితీయ వచ్చు!

"ఆర్టిఫీషియల్ ఇంటిలీజెన్స్" రెండువైపులా
పదునైన కత్తి వంటిది
ఎలాంటి సమస్యకైనా సమాధానం
ఏ పనినైనా చేసి పెడుతుంది
మనిషికి మనిషికి అవసరం లేకుండా చేస్తుంది!

పెరుగుతున్న సాంకేతిక విజ్ఞానం
పిచ్చోడి చేతిలో రాయిలా కాకూడదు
పాశ్చాత్య సంస్కృతిలో కొట్టుకు పోకూడదు
భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు
ముప్పు వాటిల్లకుండా ఉండాలి!

సంగమ క్షేత్రం

అంశం:సంగమ క్షేత్రం


శీర్శిక: ఒక్క సారి మునిగిన చాలు

అది సంగమ క్షేత్రం
మహా పుణ్య క్షేత్రం
అది గొప్ప దివ్య క్షేత్రం
పరమ పావన జల క్షేత్రం!

గంగా యమునా సరస్వతి నదులు
కలిసిన ఆనంద క్షేత్రం
మునులు ఋషులు తపస్సు చేసే
మహాద్భుత పుణ్య క్షేత్రం
ప్రపంచంలో ఎక్కడా లేని దివ్య క్షేత్రం

తెలిసో తెలియకో చేసిన పాపాలను
హరించు పావన జల క్షేత్రం
భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు
ప్రతీక సంగమ క్షేత్రం
తరతరాలుగా జరుపుకుంటున్న
కుంభమేళ ప్రదేశం

కులమత ప్రాంత భాష భేదం లేకుండా
జరుపుకునే ఉత్సవాలు త్రివేణి సంగమాలు
ఇవి జనులకు ఎంతో ఉత్సాహ భరితాలు
పాప వినాశకాలు యోగ కారకాలు

ముక్కోటి దేవతలు వసించు సంగమంలో
ఒక్కసారి మునిగినా చాలు
ఒక్క సారి జపించిన చాలు
కోటి జన్మల పాపాలు హరించు
ఒక్క సారి పిత్రు తర్పనాలు చేసిన చాలు
కోటి జన్మల పుణ్యఫలం సిద్ధించు
ఇది భారతీయుల వెలకట్టలేని సంపద!

       

నా ఊహా

అంశం: నా ఊహా

శీర్షిక: చంద్ర మండలం విహార యాత్ర
(ప్యాకేజీ పది వేల కోట్లు)

అందమైన అంతరిక్షంలో
బహు సుందరంగా ముస్తాబైన వ్యోమనౌకలో
నేను నా శ్రీమతితో కలిసి
విశ్వావసు సంవత్సరంలో మూడు మాసాలు
విహార యాత్రకు బయలు దేరాలని

భూగోళ మంతా ఉల్లాసంగా చుట్టి రావాలని
వీలయితే చంద్రమండలం వెళ్లి
చంద్రుడితో కొన్ని విషయాలు మాట్లాడాలని
పుడమి పైన జనులు నీ పిలుపు కోసం
తహతహ లాడుతున్నారనీ
వారు రావడానికి అనుకూల వాతావరణాన్ని
కల్పించమనీ చల్లని వెన్నెలను కురిపించమనీ

నాయకులు బ్యూరో క్రాట్లు బడా వ్యాపారులు
సొమ్ములు దాచ లేక ఇక్కట్ల పాలవుతున్నారని
నీ దగ్గర దాచి పెడుదామని చూస్తున్నారనీ
అవకాశం కల్పిస్తే నీ జాగను ఎంత ధరచెప్పినా
కొనడానికి సిద్ధంగా ఉన్నారనీ

చంద్ర మండలం రాక పోయినా
మనోహరమైన నిన్ను చూడక పోయినా
భూమిమీద ఉండే నీ భూమిని కొంటున్నారు అమ్ముతున్నారని మాత్రం చెప్పను
ఎందుకంటే నేనూ భారతీయున్నే కదా
మెడలు పట్టి క్రిందకు తోసేస్తడు
ప్రక్కనే మా శ్రీమతి ఉంది అసలే సతీ సావిత్రి!

అలా అక్కడ ఒక నెలంతా గడిపి
గురువు వద్దకు వెళ్ళి నమస్కరిస్తాను
అక్కడ మనుషులు నివసించడానికి
వీలుగా ఉందా లేదా అని
గురు గ్రహమంతా నెల రోజులు తిరుగుతాం
గురువుతో మాట్లాడి సెలవు తీసుకుంటాను

ఆటు పిమ్మట వెలుగుల జిలుగుల
శుక్రగ్రహం తిన్నగా వెలుతాం
అక్కడ ఓ పదిరోజులు గడుపుతాం
జనులు నివసించ యోగ్యంగా ఉందా లేదా అని
ఫోటోలు ఎప్పటికప్పుడు సాటిలైట్ ద్వారా
పంపించే ఏర్పాట్లు చేశాను

తిరిగి వచ్చేటప్పుడు భూమి చూట్టూ తిరుగుతూ
చక్కర్లు కొడుతూ షికార్లు చేస్తూ
ఆ ప్రక్కనే ఉన్న స్వర్గాన్ని దర్శించి
మా ఆలికి ఇష్టమైన దేవతా కమలాలను కోసుకుని
నేరుగా సముద్ర తీరాన దిగుతాం

          

ఆకాశ వీధిలో

అంశం: ఆకాశ వీధిలో


శీర్షిక: *గగన శిఖామణులతో ప్రయాణం*

ఆకాశ వీధిలో హరివిల్లు 
ఇంద్ర ధనుస్సులో సప్తవర్ణాలు
అవి మానవులకు అందని ద్రాక్ష పండ్లు

*విమానయానం అంటే గగన కుసుమం నాడు*
*బస్సు ప్రయాణం కంటే సులభం నేడు*
*నాడు భోగం నేడు అవసరం*

ఆహా! సుందరం ఆ విమానాశ్రయం
రైళ్ళు పరుగెడుతున్నట్లు భయం భయం
లోపలికి వెళుతుంటే అంతా అయోమయం
చూస్తుంటే కలుగుతుంది ఎంతో సంబురం!

విమానంలోనికి అడుగు పెట్టగానే
విరబూసిన ముద్ద మందారం లాంటి
చిరు నవ్వుతో
సుగంధ పరిమళాల సువాసనలతో
ఆహ్లాదపరిచే ఆహార్యంతో
స్వాగతం పలుకుతారు *గగన శిఖామణులు*
సూచనలు చేస్తారు భద్రతలు చెబుతారు
పాయిలెట్ల  అనుభవాలు వివరిస్తారు
ధైర్యాన్ని ఇస్తారు ఉల్లాస పరుస్తారు!

విమానం టేకాఫ్ తీసుకుని
రయ్ మంటూ గరుడ పక్షిలా
గగన వీధుల్లోకి ఎగురుతుంటే
ఆ ఆనందం వర్ణనాతీతం
అనుభవిస్తేనే ఎవరికైనా తెలుస్తుంది!

అద్దాల నుండి బయటకు చూస్తుంటే
పుడమి అంతా నిర్మానుష్యంగానూ
మబ్బులు నురుగులు కక్కుతున్నట్లు
పరుగులు తీస్తున్నట్లు బహు సుందరం
రాత్రి వేళల్లో వెలుగుల జిలుగులు అద్భుతం!

మబ్బులలో ఒక్కో అడుగు పైకి లేస్తుంటే
ఒక్కో అడుగు క్రిందికి దిగుతుంటే
మట్టి రోడ్లపైన "పల్లె బస్సు" నడుస్తుస్నట్లుగా
లొడలొడ బడబడ శబ్ధాలు వణుకు పుట్టిస్తాయి
మెల్లమెల్లగా మేఘాలను దాటిందంటే
ఇక అది పుష్పక విమానమే!

గగన వీధుల్లో విమాన ప్రయాణం
ఎంతో ఆనందాన్ని అనుభూతిని కలిగిస్తుంది
విమాన టిక్కెట్ ధర కాస్త ఎక్కువే అయినా
తక్కువ సమయంలో గమ్యం చేరుతాం
కనువిందు చేసే దృశ్యాలను ఆస్వాదిస్తాం!

         

ఎండాకాలంలో

అంశం: ఎండాకాలంలో


శీర్షిక: *జాగ్రత్త*

ఇంకా శిశిరం లోనే ఉన్నాం
ఎండలు మసిలి మసిలి కొడుతున్నాయి
చంద్రగ్రహణంతో షష్టి కూటమి రాబోతోంది
జాగ్రత్త అని జ్యోతిష్యం హెచ్చరిస్తుంది
రోడ్ ఆక్సిడెంట్లు అధికమని గుర్తుచేస్తుంది!

మన ఆరోగ్యంపై మనదే భాద్యత
మన జీవితం ఎందరికో ఆధారం
ఎండాకాలంలో అవసరమైతే తప్పా
వృధాగా తిరుగకుండా ఇంటి పట్టునే ఉందాం
ఆనందంగా భార్యా పిల్లలతో కాలం గడుపుదాం!

నీటిని పొదుపుగా వాడుదాం
పిట్ట గోడలపైన పక్షులకు నీటిని పెడుదాం
మొక్కలకు నీరును పోద్దాం
ఎండలో తిరుగకుండా జాగ్రత్త పడుదాం!

            

Monday, March 24, 2025

చిన్న కుటుంబం చింత లేని కుటుంబం

అంశం: యమకాలంకారాలు


శీర్షిక:  *చిన్న కుటుంబం చింత లేని కుటుంబం*

మా బామ్మ! వ *సుందర* మోము *సుందర* వదనం
సహృ *దయ* ము ఉంటే చాలదు, భూత *దయ* కూడా ఉండాలి
ఒం *టరి* గ పోయింది కుంభమేళ మహా తుం *టరి*
రెప్ప వాల్చదు క *నులు* , కదిలిస్తున్నను  మే *నులు*
కాకి *కేక* కాకికి కాక *కేక* కా అన్నట్లుగా,
ఉంటుంది బామ్మ వసుందర *మాట*, మురిగిన ట *మాట* వలెను
భార్యాభర్తల *బంధ* ము , మల్లె తీగ చందములా ఉండాలి గానీ,  *బంధ* నము లా మారకూడదు అంటది బామ్మ 
మా మేన *మామ* ఉంటాడు చంద *మామ* వలె చల్లగా ఎప్పుడూ
అత్తయ్య *పగిలి* పగిలి నవ్వుతుంది చిత్రంగా గాజు సీస *పగిలి* న శబ్ధంలా
మా *మేన* కోడలు  *మేను*  నా వలెనే తెల్లగా ఉంటుంది 
బామ్మ! వసుందర *చల్ల* ని జ్యూసులను *చల్ల* వలె మెల్లమెల్లగ త్రాగుతుంది
మాది చిన్న కుటుంబం *చింత* లేని కుటుంబం ఒక్కత్తే అమ్మాయిని
*చింత* చిగురు కూరంటే మా అందరికీ ఎంతో ఇష్టం
వైద్యనాధ్ *అమ్మ కాలు* బాగా పెరిగాయి , ఎందుకంటే మా *అమ్మ కాలు* వాపు తగ్గడం వలన
*మధ్య* ము అమ్ముతారు వ్యాపారులు *మధ్య* మధ్యన అధిక లాభాలు గడించను

        

స్త్రీ జాతికి స్పూర్తి

అంశం: చిత్ర కవిత (సునీతా విలియమ్స్)


శీరషిక: స్త్రీ జాతికి స్పూర్తి !

అందాల తారలతో
స్నేహం చేయాలని
విశ్వానికి వెలుగు తేవాలని
ఉబలాట పడింది జాబిలి!

ఆకాశంలో అలా అలా
మెరిసింది ఓ నక్షత్రంలా
వెలిగింది నిండు పున్నమిలా
తిరిగింది సూర్య చంద్రులకు ధీటుగా !

ఒక అసాధారణ వనిత
పొందెను చరిత్రలో ఎంతో ఘనత
ఇండోఅమెరికన్ అంతరిక్ష శాస్త్రవేత్త
సువర్ణాక్షరాలతో లిఖించ దగిన చరిత!

తల్లి గర్భం మాయలో పసి బిడ్డలా
నవ మాసాలు పొదిగి నట్లు
నవ మాసాలు రోదసీలో ఒదిగి
పుడమిని పులకరింప జేసిన తరుణి!

రోదసిలోనే ఆవాసం
సూన్యంతోనే సహవాసం
నిత్యం హనుమాన్ జపం
భగవద్గీత పఠనం
స్థిత ప్రజ్ఞత ఆత్మ విశ్వాసం
తన మనోబలం!

అంతరిక్ష వ్యోమ నౌకలో
సాంకేతిక ఇబ్బందులతో
ఇక్కట్ల పాలైనా సరోజ
మొక్కవోని ధైర్యంతో
అంతరిక్షంలో పరిశోధన!

ఎవరెస్ట్ శికరానికి తీసిపోని
అంతరిక్ష అనుభవాల జ్ఞాని
యావత్ స్త్రీ జాతికి  స్పూర్తి
తెచ్చెను దేశానికి గొప్ప  కీర్తి
జయహో సునీతా విలియమ్స్!

   

అలంకారాల కవిత

అంశం: ప్రక్రియ: ప్రయాగ

(అనేక అలంకారాలతో కూడిన కవిత)

శీర్షిక: *ఆకాశంలో ఉరుములు మెరుపులు*

ఆకాశంలో నీలి  మేఘాలు *అక్కడక్కడ* కమ్ముకుని ఉన్నాయి
ఉరుములు మెరుపులతో కూడిన శబ్ధాలు బయంతో జనం
పక్షులన్నీ వాటి వాటి గూళ్ళకు పరుగులు పెడుతున్నాయి
ప్రజలు ధైర్యంగా ఉండడానికి అర్జునా ఫాల్గుణా  అంటూ *స్మరిస్తున్నారు*
మరికొందరు ఎక్కడ పిడుగు పడుతుందోనని ప్రాణాలను బిగపట్టుకుని *కూర్చున్నారు*
అనుభవజ్ఞులు ఏమి కాదు పిడుగులు చెట్లమీదనే పడుతాయని ధైర్యం *చెబుతున్నారు*
ఆకాశంలో అప్పుడప్పుడు చరచర మంటూ *మెరుపులు*
*మెరుపులు* ఆగిన కొద్ది సమయానికి ఉరుముల శబ్ధాలు వినిపిస్తున్నాయి
ఆహా! ఆ అనుభూతి మరువలేనిది
*హోరు హోరున* గాలులతో కూడిన వర్షం కురుస్తుంది
*భళభళ* మంటూ ఎత్తెన తరువులు విరిగి పడుతున్నాయి
*బెకబెక* మంటూ మండూకాల అరుపులు వినిపిస్తున్నాయి
బిల్డింగులలో తలదాచుకున్నారు కొందరు
పెద్దలిస్తున్నారు పిల్లలకు అ *భయం భయం* తో వణుకుతుంటే
కుటుంబ సభ్యులలో కనబడుతుంది ఎంతో అను *బంధం బంధం* వేసినట్లుగా బావిస్తున్నారు మరికొందరు
ఉరుములకే అంత భీతి అవసరమా *రమా రమా* దేవికి ఇద్దరూ ఆడపిల్లలే
ఆకాశంలో  నీలిమేఘాలు *అక్కడక్కడా* కమ్ముకుని ఉన్నాయి
             

విశ్వంభరుడు

అంశం : మహా కవి డాక్టర్ సి. నారాయణ రెడ్డి:


శీర్షిక: *విశ్వంభరుడు*:


భానుడు ఉదయించగానే

ప్రకాశించి నట్లు

పువ్వు పుట్టగానే పరిమళించినట్లు

మారు మూల చిన్న పల్లెలో

హనుమాజి పేట మట్టిగడ్డన

కరీంనగర్ జిల్లా లోన

వ్యవసాయ కుటుంబాన జననమొంది

పీజీ వరకు ఉడ్దూలోనే చదివి

ఉష్మానియా నుండి డాక్టరేట్ 

పొందిన విజ్ఞాన వంతుడు

అద్యాపకులుగా, ఆచార్యులుగా

పలు సేవలనందించి ధన్యుడాయే

అలవోకగా అరుబది గ్రంధాల ముద్రించి

తెలుగు సాహిత్య లోకంలో అగ్రగణ్యుడాయే

ఇందుగలడందు లేడని 

పద్య ,గద్య ,వచన ,కవితలు

గజల్స్ యందు పరిపూర్ణు డాయే

గుళేబకావళికథ సినిమా  పాటలతో

సినీ రంగ ప్రస్థావన చేసి

మూడు వేల పైగా పాటలు వ్రాసి

ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేసే

"మాతృభాష" కన్న తల్లి లాంటిదని

దానిని రక్షించాల్సిన భాద్యత ప్రతిఒక్కరిదని 

సందేశమిచ్చిన దార్శనికుడు

విశ్వంభర కావ్యానికి ప్రతిష్టాత్మక

జ్ఞానపీట్ పురస్కారం 

కేంద్ర సాహిత్య అవార్డ్ 

పద్మశ్రీ , పద్మభూషణ్ ,మరెన్నో

బిరుదులు , సన్మనాలు , సత్కారాలతో 

పరవిశించి పోయే

మన సింగి రెడ్డి నారాయణరెడ్డి

వరలక్ష్మి వ్రత విశిష్టత

అంశం: *వరలక్ష్మి వ్రతం*

శీర్షిక: *వరలక్ష్మి వ్రత విశిష్టత*


*వర* అనగా, వనితలెంచుకున్న కోరిక

వరములనిచ్చునది మహా తల్లి వరలక్ష్మి

వర్తన ప్రవర్తనల నేర్పుగొప్ప తల్లి వరలక్ష్మి

శ్రావణ మాసంలోన వచ్చు వ్రతంవరలక్ష్మి! 


వ్రతములకెల్ల గొప్పనైనది వరలక్ష్మి వ్రతం

నోచిన నోములు యీడేర్ఛు వరలక్ష్మి వ్రతం

శ్రావణ పౌర్ణమి ముందు వచ్చు శుక్రవారం

జరిపెదరు స్త్రీలుయెంతో ఘనముగాను!


వ్రతములలో భిన్నమైనది వరలక్ష్మి వ్రతం

నియమములెన్నియో గల వరలక్ష్మి వ్రతం

వ్రతమునకు ముందొక రోజున ఉపవాసం

స్త్రీలునేలపడుకొని,నుండవలెబ్రహ్మచర్యం


ఉదయాన్నేలేచిఅభ్యంగస్నానమాచరించి

నూతన వస్త్రాలను స్త్రీలు ధరించి

ఈశాన్య మూలనశుద్ధిచేసి,పీట,ముగ్గులేసి

కలశం పెట్టి,నైవేధ్యంతో పూజ చేయుదురు


శుచి శుభ్రతతో  చేసిన పూజలు యేమి

నిష్టతో యిష్టంతో చేసిన వ్రతాలు యేమి

కోరిన కోరికలు కొండంత యుండ నేమి

ఫలించు , వరాలనిచ్చు తల్లి వరలక్ష్మి!

తెలంగాణ ఉద్యమంలో యువత పాత్ర

అంశం: *తెలంగాణ ఉధ్యమంలో యువత పాత్ర*

శీర్షిక: *ఉధ్యమంలో యువత*

కవిత: వచన కవిత

హామి: ఇది స్వీయ రచన , దేనికి అనుకరణ కాదు.


వీరులు

ధీరులు

మగధీరులు 

ఉధ్యమ నేతలు యువతనే!


కొలువుల కొరకు

నెలవుల కొరకు

అధికారం కొరకు

ఆత్మాభి మానం కొరకు

అడుగులు వేసింది యువతనే!


కలములు చేతబట్టి

పిడికిళ్ళు బిగ పట్టి

గళములు జతకట్టి

మేధావుల ఒడిసి పట్టి

నేతలను కూడగట్టి

ఉత్సాహం నింపింది యువతనే!


పగలు రాత్రి అనక

ఆకలి కేకలు వినక

పోలీసులకు బెదరక

లాఠీ దెబ్బలకు అదరక

పరుగులు పెట్టించింది యువతనే!


ప్రాణాలైనా అర్పిస్తాం

తెలంగాణ సాధిస్తాం

అని బలిదానాలకు పాల్పడి

తెలంగాణ సాధించింది యువతనే

కరోనా సెకండ్ వేవ్

అంశం: *కరోనా మహమ్మారి*


శీర్షిక: *కరోనా సెకండ్ వేవ్*


ప్రపంచాన్నిగడగడ లాడిస్తున్న

కాళ్ళు చేతులు కట్టేసిన

గడపదాటి బయటకు పోకుండా చేస్తున్న 

గుడులు, బడులుమూసివేసిన

మూతికి మాస్కు కట్టించిన కరోనా

గత యేడాది నుండి కరోనా శకమే!


మొదటి వేవని,రెండవ వేవని

మూడవ వేవ్ రాబోతుందని

పుకార్ల మీద పుకార్లు

మహమ్మారి అంతు బట్టదాయే


ఇపుడు వాక్సిన్స్ వచ్చే వాతలు పెట్టే

సెకండ్  వేవ్ ఉధృత మాయే

ఎందువలన పెరుగుతుందో తెలియకపాయే

 కోవాక్సిన్ వచ్చే, కో షీల్డ్ వచ్చే

వాక్సిన్ తీసుకున్న వారికీ 

తీసుకోని వారికీ కరోనా వచ్చే

ఎలా పాకుతుందో తెలియదు 

ఎప్పుడు పోతుందోతెలియదు 

ఏది ఏమైనా, కరోనా జనులకు ఎన్నో నేర్పే


జనులందరు కలిసి తిరిగే

గుడులు బడులు తెరుచుకునే  

విందులు వినోదాలు జరుపుకునే రోజు

త్వరలో రావాలనే కోరు కుందాం!

రఘుకుల సోముడు

అంశం: *రామాయణం*

శీర్శిక: *రఘుకుల సోముడు*


రామా... !రఘుకుల సోమా....!

సకల గుణాభి రామా..!

కోదండ రామా...! "2"


దశరధ పుత్రా....!

సూర్యవంశ కుల ధామా...!

అవతార పురుషా..! ఆపద్భాందవా..!

రామా...రామా..నీవే పరంధామా!


మందర మాటలు నమ్మి ,

కైక , నిను వనవాసం చేయించే ,

తండ్రి మాటను జవదాటక , రామా!."కో"


పదునాలుగు వత్సరములు

సీతా,లక్ష్మణులు వెంట రాగ

అడవుల కేగితివి ...రామా ..  "ర"


తల్లి సీతమ్మ,  మురిపము తీర్చ ..

మాయ లేడిని వెతుక బోగా

రావణుడపహరించే సతిని, రామా. "కో"


హనుమ,విభీషణ ,సుగ్రీవ అండతో .

వారధి కట్టి,రావణుని సంహరించి....

సీతను వెంట గొని తెస్తివి..

ఇచ్చిన మాటను నిలిపితివి,రామా .."ర"


చెప్పుడు మాటలు విని, చలించి

ధర్మము నిలుప జగతిన

జానకిని పంపితివి,అడవులకు..రామా."కో"


పట్టాభిషేకం జరిపించ ,రామా ..

అయోధ్యను, జనులు మెచ్చగా 

జగతి ఇచ్ఛగా, పాలించితివయ్యా!

రామా "ర"

రామా..రామా.. రామా...శ్రీ రామా...


రామ జన్మ

శీర్షిక: *రామజన్మ*

త్రేతా యుగమున అవతరించే మహుడు

అవతార పురుషుడు శ్రీ రామచంద్రుడు

చైత్ర మాస తొమ్మిదవ రోజైన నవమి నాడు

ధశరథమహారాజు కౌసల్యలకు కవల 

పిల్లలలో శ్రేష్టుడుగా

దశావతారాలలో ఏడవ అవతారముగా

అవతరించె నిలన ధర్మ పాలన కొరకు

పట్టాభిషేక సమయాన మందరకు పుట్టె

చెడు బుద్ది నొకటి

మదిన తొలచ , కైకేయి దరి చేరి చెప్పె నొకటి

రేపు రాముడి పట్టాకషేకమని,నీకు దశరథుడు

యిచ్చిన రెండు వరాలను కోరమని వివరించ

పరుగు పరుగున కైకేయి కదిలె దశరథుడి చెంతకు

వచ్చిన విషయమేమని , దశరథుడు కోరగా

వివరించే కైకేయి ,తనకిచ్చిన రెండు కోర్కెల

మొదటిది భరతుడి పట్టాభిషేకం కోరే

రెండవది 14 సం.రాలు వనవాసం

నిర్ఘాంత పోయే దశరథుడు దుష్ట కైక కోర్కెలకు

విధి లేక దశరథుడు ,అటులనే నని మూర్చిల్లే!

విధి చేతిలో కీలుబొమ్మలం

*నేటి అంశం*పదాల కవిత*


*పదాలు:*

*మౌనమే నీ భాష*
*విరిసిన*సుమం*
*హృదయాకాశం*
*అనురాగ నిలయం*

శీర్షిక: *విధి చేతిలో కీలుబొమ్మలం*

గలగల పారే గోదావరిలా మాటాడే నీవు
చిలుక పలుకుల్లా ఉండే నీ మాటలు
ఆమని కోయిలలా ఉండే నీ గాత్రం
నేడు  *మౌనమే మూగ భాష* ఆయెనా!

అర *విరిసిన సుమం* లా విప్పారిన
నీ హృదయం పరిమళం లేని
శిలలా మారుటకు కారణం ఏమి?
అంతా విధి నిర్ణయం విధి చేతిలో
అందరం కీలు బొమ్మలం!

నీ మనసు *హృదయాకాశం* లా
ఎంతో విశాలమైనది గంగలా నిండైనది
నీ ప్రేమ దయ అమృత భాండాగారం
నీ వ్యక్తిత్వం ఎత్తైన ఎవరెస్ట్ శిఖరం!

నీ ఆలోచనలు భావాలు నడవడిక
జాలి కరుణ మమతలు చిరునవ్వు
అందం ఆహార్యం నీ ఆభరణాలు
నీ మనసు *అనురాగ నిలయం*
మౌనమే మూగ భాషాయనా మనసా!

      

Saturday, March 22, 2025

మామిడి పిక్కలు

 శీర్షిక: మామిడి పిక్కలు


యేవేవో పండ్లను తింటుంటాం
ఎక్కడెక్కడో పారేస్తాం పనికిరావని
ఎప్పుడో తిని పారేశారు
మామిడి పండ్ల పిక్కలను
మరిచి పోయారు చాలాకాలం

ఎండకు ఎండి
వానకు తడిసి
చలికి వణికి
అవి వసంత కాలంలో

పెరటిలో మొక్కలై మొలిచాయి
నిజంగా అది అదృష్టమే
గుర్తుకొచ్చాయి మామిడి పిక్కలు
అవి బంగిన పల్లి మామిడి పళ్ల మొక్కలు 

గోతులు త్రవ్వే
విడి విడిగా నాటే
నీరు ఎరువు వేయసాగే
చుట్టూ కంచెను నాటే
పెరిగి పెద్దాగాయే కాలక్రమేనా
పూతా కాతా మొదలాయే

వృక్షాలు మహావృక్షాలాయే
ఆకులు పచ్చతోరణాలుగా
పండుగలకు పెళ్ళిళ్ళకు
ఎండిన కొమ్మలు వంటకు
ఫలాలను ఇంటిల్లి పాది తినుటకు
బంధు మిత్రులకు ఇచ్చుటకు
మిగిలినవి అమ్ముటకుపయోగపడే
తిని పారేసిన మామిడి పిక్కలు
కాస్త శ్రమిస్తే , కాస్త దృష్టి పెడితే
ఇంట సిరులను కురిపిస్తుండటం
మహా లక్ష్మీ ప్రధమే కదా
అది శుభ పరిణామమే కదా

అందాల పూ బోణీ

అంశం: విరహ విలాసం


శీర్షిక:  *అందాల పూబోణి*

తళ తళ మెరిసే
కలల రాణివి నీవే
అలలా సాగి పోయే
అందాల పూ బోణివి నీవే!

హిమలయాలలో విరిసిన నా వాణి
రోతంగ్ పాస్ లో మంచు గడ్డల ఎగిరేసిన శ్రీవేణి
గలగల పారే బియాస్ నదిలో పాట పాడిన ఇంద్రాణి
ప్యారాచూట్ లో పచార్లు చేసినది మరిచితివా!

ఫాయివ్ స్టార్ హోటల్ లో చిలుక గోరింకల్లా
ప్రక్క ప్రక్కనే కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ
హిడింబి టెంపుల్ దగ్గర సెల్ఫీలు దిగితిమి
దేవదారు తరువుల నీడన బాసలు చేసుకుంటిమి!

కారులో ప్రయాణిస్తూ ఎత్తెన మంచు కొండలు
పాతాళ లోయలు తిలకిస్తూ హొయలొలికిస్తూ
హాహా కారాలు చేస్తూ కన్న కలలను తుడిచేసేవే
నేను కనిన విలాసాలను కనుమరుగు చేశావే
కాన రాని లోకాలకు తరలి పోయావే
విరహ వేదనతో కుమిలేటట్లు చేశావే!

నా కలల రాణి
విరబూసిన పూబోణి
నా మనసు దోచిన శ్రీవాణి
నేనెప్పుడు నిను మరువను త్రివేణి!

     

దుఃఖాన్ని దిగమ్రింగుతూ అన్నదాత

అంశం: చిత్ర కవిత (అన్నదాత-ప్రకృతి ప్రకోపం)



శీర్షిక: దుఖాన్ని దిగమ్రింగుతూ అన్నదాత

నిత్య కృషీ వలుడు రైతన్నా!
నిరంతర శ్రమజీవి రైతన్నా!
దేశానికి వెన్నెముక రైతన్నా!
అన్నార్తులకు ప్రాణదాత రైతన్నా!

కండలు కరిగించుతూ రైతన్నా!
ఎండలో మాడుతూ రైతన్నా!
గంజి మెతుకులనారగిస్తూ రైతన్నా
ఆలు బిడ్డల డొక్కలు మాడ్చే రైతన్నా!

గోచిని చెక్కి, తలకు రుమాలు చుట్టి
హలమును పట్టి,  కావడెద్దుల కట్టి
పొలమును దున్ని,  ఒడ్డులను గట్టి
గొర్రును తోలి,  మడులను కట్టి!

నారును పోసి , నాట్లను వేసి
నీరును పారించి , మందులు చల్లి
పంటలు పండించు రైతన్నలకు
వరుణుడు కరుణించకుంటే అధోగతే!

ప్రకృతి ప్రకోపంతో సకాలంలో వర్షాలు పడక
నేల తల్లి బీటలు బారగ నారు ఎండిపోగా
దిక్కు తోచక రైతు దున్నల మేపుతుండే
డొక్కలెండిన రైతు అప్పులు ఎలా తీర్చాలని
ఆకాశంలో చూస్తుండే దుఃఖాన్ని దిగమ్రింగుతూ అన్నదాత!
 

అన్నదాత

శీర్షిక: అన్నదాత 


నిత్య కృషీ వలుడు రైతన్నా!
నిరంతర శ్రమజీవి రైతన్నా!
దేశానికి వెన్నెముక రైతన్నా!
కోట్లాది జనులకు ప్రాణదాత రైతన్నా!

కండలు కరిగించుతూ రైతన్నా!
ఎండలో మాడుతూ రైతన్నా!
గంజి మెతుకులనారగిస్తూ రైతన్నా
ఆలు బిడ్డల డొక్కలు మాడ్చే రైతన్నా!

గోచిని చెక్కి, తలకు రుమాలు చుట్టి
హలమును పట్టి,  కావడెద్దుల కట్టి
పొలమును దున్ని,  ఒడ్డులను గట్టి
గొర్రును తోలి,  మడులను కట్టి

నారును పోసి , నాట్లను వేసి
నీరును పారించి , మందులు చల్లి
పంటలు పండించు రైతన్నలకు
ఏమి మిగులు తుండే నేడు అన్నదాతలకు!

భూముల సాగు చేయు రైతు
పేరుకే గొప్ప  మహా రాజు రైతు
రైతు వెనకాలే ఉంటాడు ఆంబోతు
శవాలపై చిల్లర ఏరుకునే తిరుగుబోతు!

కల్తీ విత్తనాలతో కలవరం పుట్టిస్తుండే
పలానా పంటే వేయాలని వత్తిడి తెస్తుండే
ఎరువులు సమయానికి అందకుంటుండే
పండించిన పంటలకు గిట్టుబాటుధర లేకుండే!

రైతు బంధు పథకం భూస్వాములు మేస్తుండే
పెట్టుబడులకు రైతులు అప్పులే తెస్తుండే
పంటల కొచ్చిన డబ్బు అప్పులు తీరకుండే
అప్పులు తీరక అన్నదాతలుఅవని వీడుతుండే!

ఆరుగాలం చేసే కౌలుదారుకు
రైతు బంధు పథకం  ఎందుకట 
భూస్వాముల మేపేటందుకట
రైతుల అప్పుల పాలు చేసే టందుకట
ఆపై ఆత్మ హత్యల పురికొల్పేటందుకట!

జై జవాన్! జై కిసాన్! జై విజ్ఞాన్!

వచ్చిందయ్యా స్వాతంత్ర్యం వచ్చిందయ్యా

అంశం: జానపద గేయాలు


శీర్షిక: వచ్చిందయ్యా స్వాతంత్ర్యం వచ్చిందయ్యా!

పల్లవి;
వచ్చిందయ్యా స్వాతంత్ర్యం
వచ్చిందయ్యా...
ఆంగ్లేయుల పాలనలో
ఆహుతైన మనదేశం...
దుష్ట గాండ్ల మోసగాండ్ల
కొంందరినీ నింపుకునీ...              "వచ్చిందయ్యా"

చరణం:01
అగుపడిన పిల్లవాళ్ళకు..
అగుపడిన ముసలి వాళ్ళకు..
గొప్ప గొప్ప నీతులెన్నో..
గుచ్చి గుచ్చి చెప్పిరయ్య...            "వచ్చిందయ్యా"

చరణం:02
చీకటి వేళ కాగానే..
బింకెడంత చేతబట్టి...
అందులోకి గుడ్డు మాడ్చి..
బేవ్ మంటూ తాగిరయ్య....            "వచ్చిందయ్యా"

చరణం:03
అర్ధరాత్రి దాక నైనా...
వాడ వాడ తిరిగిరయ్య ...
సి.ఐ.డిల మంటూ...
షికార్లు కొట్టిరయ్య....                    "వచ్చిందయ్యా"

చరణం:04
అందమైన పడుచు ఇంట్లో...
ఆ రాత్రి తిష్ట వేసి....
తెల్లవారి పోగానే...
దొరలమంటూ తిరిగిరయ్య...         "వచ్చిందయ్యా"

     

ఆమె నా చెలి! (ఉపమాలంకారాలు)

అంశం: అలంకారాలు (ఉపమాలాంకారాలు)


శీర్షిక: *ఆమె నా చెలి!*

ఆమె నా చెలి! దివి నుండి భువికి దిగి వచ్చిన అప్సరస!
రంభా ఊర్వశి మేనక కన్న మిన్న ఆమె అందం
ఆమె ముఖం ఉదయించే సూర్యుడిలా తేజోవంతం!

చందమామలా గుండ్రని మోము
కలువ రేకుల వంటి కనుబొమ్మలు
హంస రెక్కలు వంటి ఆమె కనురెప్పలు
తేనేలొలక బోసినట్లు మెరిసే కనులు
లేత కోవాలాంటి చెంపల బుగ్గలు!

అరవిరిసిన కమల పద్మం లాంటి నువ్వు
స్వచ్ఛమైన వెండితీగెల్లా తళతళ మెరిసే పళ్ళు
నల్లని మేఘాల వంటి కురులు
నాగ త్రాచు వంటి పొడవాటి జడ!

సాంప్రదాయంగా ఆరు గజాల పట్టు పీతాంబరం చీర
నెమలి పించములా సొగసులద్దిన మిలమిల మెరిసే జాకెట్టు
ముంజేతులకు మేలి బంగారు గాజులు
నుదుట పడమట అస్తమయమున కనపించే సూరీడు వంటి ఎరుపు రంగు కుంకుమ బొట్టు!

కొప్పున జాబిలి వెన్నెల వంటి మల్లె పూలదండ
అరుంధతి దేవికి సరితూగే ప్రాతివత్యం
నిండు మనసు , అన్నపూర్ణ లా ఆర్తిని తీర్చు కల్పవల్లి
సతీ సావిత్రి లా ముత్తైదువతనం కాపాడుకోగల సత్యవంతురాలు, ఆమే నా చెలి నిచ్చెలి!

    

Friday, March 21, 2025

రంగులండీ రంగులు

అంశం: రంగులండీ రంగులు


శీర్శిక: *రంగులండీ రంగులు*

పల్లవి:
రంగులండీ రంగులు....
రంగురంగుల పతంగులు...
రంగురంగుల పౌడర్లు...
రంగురంగుల కలర్లు....
రంగురంగుల ఆనందాలు...!

చరణం:01
రంగురంగుల పతంగులు....
అందమైన పతంగులు..
పిల్లల్లారా రారండీ...
ఆకాశంలోకి చూడండి...
ఆడుతూ పాడుతూ ఎగిరేద్దాం...
అందరం కలిసి ఆనందిద్దాం!             "రంగులండీ"

చరణం:02
పౌడర్లండీ పౌడర్లూ...
తెలుపు ఎరుపు పసుపు.....
రంగురంగుల పౌడర్లు...
నీళ్లల్లో న కలిపేద్దాం....
నిండుగా మీదా చల్లేద్దాం...
హాయిగా హోలీ ఆడేద్దాం...!      "రంగులండీ"

చరణం:03
కలర్లండీ కలర్లూ...
ఎరుపు తెలుపు ఆకుపచ్చ
రంగురంగుల కలర్లూ...
లోగిళ్లలో ముగ్గులు వేద్దాం
ముగ్గుల పైన రంగులు వేద్దాం
అమ్మా నాన్నకు చూపిద్దాం...
హాపీ న్యూఇయిర్ జరుపుకుందాం..    "రంగులండీ"