Thursday, March 20, 2025

గుండె గొంతుక

అంశం: గుండె గొంతుక

శీర్షిక: *పిడికెడంత గుండె*

*బోడి గుండుకు మోకాలికి*
*సంబంధం లేకపోవచ్చు నేమో గానీ*
*గుండెకు గొంతుకకు అవినాభావ*
*సంబంధం ఉంది*

మనిషికి ఏదేని బాధ కలిగినపుడు
కోపం వచ్చినపుడు కష్టం ఏర్పడినపుడు
గుండె రగిలిపోతుంది గొంతుక ఎండిపోతుంది
గుండె బరువు ఎక్కువైతే అనారోగ్యామే!

ఇంటికి పెద్ద *నాన్న* అని తాను భావిస్తాడు
ఏ బాధ నైనా గుండెలోనే దాచుకుంటాడు
ఏ కష్టాన్నైనా గుండెలోనే అదిమి పెడుతాడు
తన వ్యధ ఏదో తానే పడుతాడు
కానీ  తన గోడును ఎవరికి చెప్పుకోడు!

బయటకు చెప్పుకుంటే పరువు విలువ
పోతుందనుకుంటాడు
చిన్న తనం అవుతుందని గొంతు విప్పడు
తనలో తానే కుమిలి పోతాడు!

భాద్యతలను నెరవేర్చడానికి
పెద్ద తనాన్ని దక్కించుకోడానికి
ఏవేవో పనులు చేస్తుంటాడు
ఎక్కడో అప్పులు తీసుకొస్తాడు
అవి భార్య పిల్లలకు చెప్పడు
తన గుండెలోనే దాచుకుంటాడు
బాధ ఎక్కువైతే దూరంగా పోయి దుఖిస్తాడు
కానీ గొంతు విప్పి బయటకు చెప్పడు!

ఇక అమ్మ తన బాధలను కష్టాలను
గుండెలోనే దిగమ్రింగుతూనే
ఉద్యోగాలు చేస్తూ డబ్బు సంపాదించినా
ఒక్కోసారి బయటకు చెప్పేస్తుంది
స్వాంతన పొందుతుంది
కావల్సినంత సమయం దుఃఖిస్తుంది
ఉపశమనం పొందుతుంది
నాన్న ఏడ్చే హక్కు కోల్పాయాడు
ఎందుకంటే *మగాడు* అనే భావనతో
అందుకే మగవారికే గుండె పోటు జబ్బులు
తరుచుగా వస్తుంటాయి
స్త్రీల కంటే పురుషులకు ఆయుష్షు తక్కువగా ఉంటుంది
అందుకొరకే మహిళలు ఎక్కువ కాలం జీవిస్తారు!

*ఆరోగ్యమే మహాభాగ్యము* అంటారు పెద్దలు
ఏమి సాధించినా ఏమి సంపాదించినా
ఆరోగ్యంగా ఉంటేనే కదా ఏదైనా అనుభవిస్తాం
అనుభవించలేని ఆస్తులు ఎందుకు
అమ్మైనా నాన్నైనా మరెవరైనా
బాధలను కష్టాలను గొంతు విప్పి చెప్పాలి
ఒకరితో నొకరు పంచుకోవాలి
పిల్లలకు సున్నితంగా ఆర్ధిక విషయాలు తెలుపాలి
చర్చించాలి  సలహాలు తీసుకోవాలి
బాధలను పిడికెడంత గుండెలో దాయకూడదు
గుండెపై భారం పడనీయకూడదు
బ్రతికిన నలుబది యేండ్లైనా
ఆనందంగా సంతోషంగా తృప్తిగా జీవించాలి
*సర్వే జనా సుఖినోభవంతు*
  
     

No comments: