అంశం: కారుణ్య ధార
శీర్షిక: *మాట్లాడే పెదాలకన్న చేసే చేతులు మిన్న*
*కరుణ లేని వారు కాట్లే ఉంటే ఏమి ఏట్లో ఉంటే ఏమి* అన్నట్లు
ప్రేమ జాలి దయ కరుణ అనేవి
మానవత్వానికి దీపికలు
ఒక మనిషి వ్యక్తిత్వానికి ప్రతీకలు
అతని మహోన్నతానికి కీర్తి పతాకలు!
ఆప్యాయతలు అనురాగాలు వదిలి
కోపాలు తాపాలు ద్వేషాలు ఈర్ష్యలు
కుట్రలు కుతంత్రాలు కామ క్రోధాలతో
అసూయలతో స్వార్ధంతో గడుపుతూ
ఏమి సాధిస్తారు? ఎంతకాలం బ్రతుకుతారు?
మనిషి సగటు వయసు
నూరు వత్సరాలు అనుకున్నా
యాబై సంవత్సరాలు నిద్రకే పోతాయి
అందులో పదేళ్లు బాల్యం పదేళ్లు ఆహారం
ఇరువది ఏళ్ళు చేసే వృత్తికే పోగా
ఇక మిగిలినవి ఐదు యేండ్లు!
ఈ ఐదు యేండ్లు కూడా
కారుణ్యత చూపించకుండా
అహంతో రగిలిపోతే మనిషిగా పుట్టి
ప్రయోజనం ఏమి?
ఎనుబది నాలుగు లక్షల జన్మల పిదప
మనిషి జన్మం లభిస్తుందని అంటున్నాయి
వేదాలు పురాణాలు మరియు ఇతిహాసాలు
గలగల పారే నిండు గోదావరిలా
జలజల జారే జలపాతంలా
నిస్వార్థంగా సేవలనందించే ప్రకృతిలా
ఎంత తొక్కినా ఓర్మితో నుండే భూమాతలా
ఏమీ ఆశించకుండా ప్రాణంగా చూసుకునే
పంచభూతాల్లా
ఆపదలో ఉన్న తోటి మనిషిపై
తోడుగా నివసిస్తున్న సాటి ప్రాణిపై
కాసింత జాలి దయ కరుణ ప్రేమను చూపు
సలహాల నివ్వు చేతనైతే సేవలు చెయ్యి
ఇంకా చేతనైతే ఆర్ధిక సహాయం చేయి
*మాట్లాడే పెదాలకన్నా చేసే చేతులు మిన్న*
అంటారు పెద్దలు
అంతే కానీ తోటి మనిషిని
హీనంగా చూడకు హేళన చేయకు
అపహాస్యం చేయకు కాలు లాగకు
గోతులు త్రవ్వకు కుట్రలు చేయకు
కలతలు రేపకు కంటి తడి పెట్టించకు
అహంతో రగిలిపోకు ఆరోగ్యం పాడుచేసుకోకు
ఆయుష్షు తగ్గించుకోకు!
No comments:
Post a Comment