Sunday, March 2, 2025

ఆకలి రంగు P

అంశం: ఆకలి రంగు
శీర్షిక: *సప్తవర్ణ శోబితమై*

రగులుతున్న కుంపటిలా
మండుతున్న అగ్ని గోళంలా
సముద్రంలోని బడబానలంలా
కడుపులో మసలుతున్న జఠరసంలా
ఉంటుంది ఆకలి రంగు

ఈగలు ముసురుతున్నా
గంజి మెతుకులను పిసికి తింటున్న
ముసలి వాళ్ళ క్షోభలా
గ్రామసింహాల వలే చెత్త కుండీల వద్ద
ఎంగిలి మెతుకుల కొరకు పోట్లాడుకుంటున్న
వీధి బాలల రుధిరం వలే ఉంటుంది ఆకలి రంగు

రెక్కాడుతే గానీ డొక్కాడని కూలీల
ఆకలి ఒకలా
పొలికేకలతో పండు టాకుల వలే
రాలిపోతున్న వృద్ధుల ఆకలి మరోలా
ధనికులు కుబేరులు మురిసి పోతూ
అనుభవిస్తున్న పంచభక్ష్యపరమాన్నాల ఆకలి ఒకలా
క్షుద్భాధతో నీరసిస్తున్న గిరిజనుల ఆకలి
రంగు మరోలా
సప్తవర్ణ శోభితమై ఉంటుంది ఆకలి రంగు

అందరు మనుషుల్లో పారే రుధిరం
ఒకటే అయినా
మనసుల్లో మెదిలే మమతలు
ఆశలు కోరికలు స్వార్ధం  కొండ చిలువ
కోరల్లలో నుండి వెలువడే విషం వలే
ఊసరవెల్లిలా ఆకలి రంగు మారుతుండు

ఆకలికి రంగు రుచి ఉండటం కాదు
అది ఏదైనా దీనులకు అమృత తుల్యమే

కోట్లాది అనాధల , బడుగు జీవుల
ఉచిత బియ్యం కొరకై నిత్యం
పడిగాపులుకాసే పేదల కడుపు మంటలవలే
పొయ్యిపై సలసల కాగే నీటి నుండి వచ్చే
ఆవిరి వలే ఉంటుంది ఆకలి రంగు

No comments: