Monday, March 10, 2025

శ్రీమాన్ పరవస్తు చిన్నయసూరి

శీర్షిక: *శ్రీమాన్ పరవస్తు చిన్నయ సూరి*


*చాత్తాద శ్రీవైష్ణవ కుల భూషణుడు, గద్య రచనా ఘనుడు "శ్రీ పరవస్తు చిన్నయ సూరి"*

*"శ్రీమాన్ పరవస్తు చిన్నయ సూరి"*,  చాత్తాద శ్రీవైష్ణవ కులమున జన్మించడం ఎంతో గర్వ కారణం*

తెలుగు రచయిత, పండితుడు . ఆయన రచించిన బాల వ్యాకరణం, నీతి చంద్రిక చాలా ప్రసిద్ధి గాంచినవి.  వీరి విద్య, భాషాభి వృద్ధికి అధికంగా తోడ్పడిన వారు సర్ సి.పి.బ్రౌన్ దొర, శ్రీ లక్ష్మీ నరసింహ శ్రేష్టి, జస్టిస్ రంగనాధ శాస్త్రి, కుమారస్వామి శాస్త్రి లాంటి వారిని ప్రముఖులుగా
పేర్కొనవచ్చు.

*శ్రీమాన్ పరవస్తు చిన్నయ సూరి* 1809 లో, పెరంబదూర్ , జంగల్వట్టు, అప్పటి మద్రాసు రాష్ట్రంలో (నేడు చెన్నై ) జన్మించారు. 1861 లో దైవైక్యమయ్యారు.

వీరి తల్లిదండ్రులు శ్రీమాన్ వేంకట రంగ రామానుజాచార్యులు ,తల్లి శ్రీమతి శ్రీనివాసాంబ గారు.


19  , 20  శతాబ్దాలు ప్రధానంగా , ఆంధ్ర సాహిత్యానికి గుర్తింప దగినవి. తెలుగు సాహిత్యం తన తొలినాటి పద్య గద్య స్వరూపాలతో విలక్షణమైన , విచక్షణ మైన మార్పులను చోటు చేసుకుని మలుపు తిరిగిన కాలమది .
          ***********
*శ్రీమాన్ వేంకట రంగ రామానుజా చార్యులు* మహా పండితులు. వీరు శ్రీ పెరంబదూరున ద్రవిడ వేదాధ్యయనం చేయించు ఆచార్యులు . వీరికి చాలా కాలం వరకు  మగ సంతానం కలుగలేదు . అందుకు వీరి దంపతులు చేయని పూజలు , చేయని వ్రతాలు లేవు. చివరగా  శ్రీ శ్రీనివాసా చార్యుల ఆధ్వర్యమున , *పుత్ర కామేష్టి* యాగం చేయుటచే , ఆ దంపతులకు  మగ శిశువు జన్మించాడు.  పేరు శ్రీనివాసుడు అని పెట్టారు. అతడే శీనయ్య , *చిన్నయ్య* గా నిలిచి పోయాడు.

లేక లేక పుట్టిన గారాల బిడ్డ , పెరిగి పెద్ద వాడయ్యాడు . *పండిత పుత్ర పరమ శుంఠ* కాకూడదని , కీర్తి నార్జించాలని   *శ్రీమాన్ రంగ రామానుజా చార్యులు*  , తన స్నేహితుడైన  శ్రీ కంచి రామానుజా చార్యుల వద్ద , విద్యనార్జింప చేశాడు.  

బాల సూరికి జ్ఞ్యానోదయం అయ్యింది. శ్రీ కంచి రామానుజా చార్యుల వద్దనే విద్యాభ్యాసం , ఏక సంధాగ్రహి, సర్వ శాస్త్ర విద్యా పారంగతుడయ్యాడు. తండ్రి నుండి వ్యాకరణాదుల అభ్యాసనం చేశాడు. సకల విద్యలకు ప్రాణ బీజమైన *హయ గ్రీవో పాసనా* మంత్రోపదేశమును , శ్రీ రామ శాస్త్రుల వద్ద పొంది సంపూర్ణ శాస్త్ర విజ్ఞ్యాన సంపన్నుడయ్యాడు. 


విక్టోరియా మహారాణి పట్టాభిషేక మహోత్సవం , 1837  లో లండన్ నగరంలో జరిగింది . మద్రాస్ పట్టాభిషేక మహోత్సవ సభలో పద్య రత్నములను  చదివారు శ్రీ చిన్నయ్య గారు . శ్రీ చిన్నయ్య ప్రతిభను గుర్తించిన , నాటి పచ్చయ్యప్ప కళాశాల వారు , ప్రెసిడెన్సీ కళాశాల పండిత పోటీ పరీక్షలను నిర్వహించిరి.  ఆ పండిత పోటీ పరీక్షల్లో , శ్రీ చిన్నయ్య గారు  ప్రథముడిగా నెగ్గడం వలన , వీరిని  ఆ కళాశాల వారు ప్రథమాంధ్ర పండితునిగా నియమించారు . అది శ్రీ చిన్నయ్య గారికి , గొప్ప  పేరు ప్రఖ్యాతులను తెచ్చి పెట్టింది . పండిత మండలిలో అగ్ర గణ్యుడైనాడు . వారి బోధనా పటిమకు గౌరవాదరములు లభించినవి.  "అర్బత్ నాట్"  దొరగారు , "శాస్త్రి" , "శర్మ" అను బిరుదముల వలె , శ్రీ చిన్నయ్య గారికి *చిన్నయ్య సూరి* అను బిరుదు చెక్కింప బడిన  బంగారు కంకణమును , లండన్ నుండి తెప్పించి , ఒక  సభలో  శ్రీ చిన్నయ్య గారి చేతికి తొడిగిరి . ఆనాటి నుండి  చిన్నయ్య కాస్తా * చిన్నయ్య సూరి* గా ఖ్యాతి నొందిరి. పరవస్తు మఠ , పరంపర నుండి వచ్చాడు కాబట్టి , వారి ఇంటి పేరు *పరవస్తు* గా నిలిచిపోయినది.  


ధర్మార్ధ కామ మోక్ష సాధనకై , భాష నీతి కౌశలాదులు విద్యార్థులకు అబ్బుటకై , *నీతి చంద్రిక*  ను రచించి  "అర్బత్ నాట్" దొర గారికి అంకిత మిచ్చారు. *పద్యానికి నన్నయ , గద్యానికి చిన్నయ* అను నానుడి ప్రజల నోట నిలిచి పోయింది .  వీరి హిందూ ధర్మ శాస్త్ర  సంగ్రహం  లండన్ గ్రంధాలయం మందు మాత్రమే లభించును .  వీరి రచనలందు  *బాల వ్యాకరణం* మకుటాయ మాయం.

చాత్తాద శ్రీ వైష్ణవ  జాతికి గౌరవాదరములు కల్పించిన  *శ్రీమాన్ పరవస్తు చిన్నయ్య సూరి* గారు చిరస్మరణీయులు .

No comments: