Monday, April 14, 2025

ఆనందంలో దుఃఖం (చిత్ర కవిత)

అంశం:చిత్ర కవిత (పెళ్లి అయ్యాక కూతురు తల్లిదండ్రులను వదిలి వెళ్ళే పెళ్లి కూతురు)

శీర్షిక: *ఆనందంలో దుఃఖం* 

కడలి నుండి ఉవ్వెత్తున ఎగిసిపడే 

బలమైన కెరటాల్లా 

కడుపులో నుండి తన్నుకుంటూ 

పొంగి పొరలి వచ్చే కన్నీటి ధారలు 

ఎదలోని సొదను వెళ్ళ బుచ్చుకొనే 

అరుదైన సమయం 

పుట్టింటికి దూరం అవుతున్నానని 

గుండెలోని బరువును దింపుకునే 

మహత్తర అవకాశం!


దివి నుండి భువికి దేవతలు దిగి వచ్చి 

ఓదార్చినా ఆగని కన్నీటి మత్తడి 

అప్పటి వరకు ఆ పుత్తడి వేసుకున్న 

మేకప్ అంతా చిత్తడి!


బిడ్డా నీవు మా గుండెల్లోనే ఉంటావు  

మమ్ముల్ని ఎప్పుడూ మరిచి పోకూ అంటూ

తల్లిదండ్రులను తోబుట్టువులను 

దుఃఖ్ఖ సాగరంలో ముంచే సమయం 

బంధు మిత్రులను సహితం కంటతడి 

పెట్టించే సన్నివేశం!


పెళ్లి కొడుకు, నా భార్య కన్నీరు మున్నీరుగా 

ఏడుస్తున్నదని తట్టుకోలేక 

తలను ఎదలోకి తీసుకుని ఓదార్చే 

మహత్తర  అవకాశం 

అత్తా మామలు సహితం చలించి 

నీకు కష్టం కలుగ కుండా మేము చూసుకుంటాం 

అంటూ భరోసా నిచ్చే సన్నివేశం! 


పెళ్లి కూతురు పెళ్లి అయ్యాక ఇంటికి వచ్చి 

కడప కడిగి ముగ్గు పెట్టి

తల్లిదండ్రులతో తోబుట్టువులతో 

నేను మీ నుండి సెలవు తీసుకుంటున్నాను 

అమ్మా నాన్నా అన్నాతమ్ముళ్ళు

అక్కా చెల్లెళ్లు అంటూ 

ఎక్కి ఎక్కి ఏడుస్తూ కూతురు! 


నాకు జన్మ నిచ్చి పెంచి పెద్ద చేసి 

విద్యా బుద్దులు నేర్పుతూ 

నన్ను బంగారంలా చూసుకుని

పెళ్లి బంధంతో నన్ను మరో ఇంటికి 

సాగనంపు తున్నారా అమ్మా నాన్నా అని

మనసులో తలుచుకుంటూ!


పుట్టింటి పేరు మార్చుకుని 

నా ఊరు వాడా జాడలను

నేను పెంచి పోషించిన పూల మొక్కలను 

ప్రాణానికి ప్రాణంగా చూసుకునే స్నేహితులను

రోజూ ముగ్గులు పూయించే స్వర్గాన్ని వదిలి 

వెళ్లి పోతున్నానమ్మా అంటూ 

ఆనందంలో దుఃఖంతో  పుట్టింటి కడప దాటి 

తరలి వెళ్ళుతున్న పెళ్లి కూతురు!

No comments: