Friday, April 18, 2025

బంధు పధకాలు రైతులకేనా

 శీర్షిక: *బంధు పధకాలు రైతులకేనా*


*కలిమిలో కులికే వారున్నారు*
*కొలిమిలో మండే వారున్నారు*
*పీత కష్టాలు పీతవి సీత కష్టాలు సీతవి*
ఎవరి వృత్తి వారిది ఎవరి కష్టం వారిది
ప్రతి వృత్తిలోనూ ఉంటాయి
కన్నీటి బాధలు చన్నీటి దుఃఖాలు
కష్టాలు నష్టాలు బాధలు దుఃఖాలు
కష్టాలు లేనిదెవరికి నష్టాలు రానిదెవరికి
బాధలు ఇక్కట్లు అందరికీ ఉంటాయి
బరువుబాధ్యతలు అందరికీ ఉంటాయి
సుఖదుఃఖాలు అందరికీ ఉంటాయి
అన్ని మతాలలో అన్ని కులాలలో 
పేదసాదలు ధనికులు ఉంటారు 
ఓటు బ్యాంకు రాజకీయాలు
ఇకనైనా మానుకోవాలి

కార్మికులు కర్మాగారాలలో పనిచేయకుండా
ఉత్పత్తి పెరుగుతుందా?

అడ్డ కూలీలు నిర్మాణాల వద్ద పనిచేయకుండా
ఆకాశ హార్మ్యాలు పెరుగుతాయా ?

కమ్మరులు పనిముట్లు చేయకుండా
వ్యవసాయం జరుగుతుందా?

కుమ్మరులు శ్రమించ కుండా
కుండలు తయారవుతాయా?

కౌలు దారులు శ్రమించకుండా
వ్యవసాయం జరుగుతుందా?

వ్యవసాయ కూలీలు పని చేయకుండా
పంటలు పండుతాయా?

ఇన్వెస్టర్లు  పెట్టుబడులు పెట్టకుండా 
ఆర్ధిక వ్యవస్థ నిలుస్తుందా ?
షేర్ మార్కెట్ పడితే ఆత్మహత్యలు 
చేసుకున్న వారు ఉన్నారు 

*బిందువు బిందువు కలుస్తేనే సింధువైనట్లు*
*చేయి చేయి కలుస్తేనే ఉత్పత్తి పెరుగుతుంది*

లోతుగా పరిశోధిస్తే ప్రకృతి వైపరీత్యాలైన
కరువుకాటకాలు భూకంపాలు సైక్లోన్లు
తుఫానులు వైరస్ మరేవైనా
ఏ కొందరికో  కొన్ని వృత్తులవారికో
పరిమితం కాదు అనేది నగ్న సత్యం!

పంటలు లేకుండా మనిషి బ్రతకడం కష్టం
ఒప్పుకోవడంలో ఎవరికీ సందేహం లేదు 
కేవలం రైతు ఒక్కడే పంటలు పండించగలడా?
మరపట్టించకుండానే వడ్లను తినగలరా?
డబ్బు లేకుండా బ్రతుక గలరా ?
పెట్రోల్ లేకుండా ప్రయాణం చేయగలరా?
పవర్ లేకుండా  గడుపగలరా ?
నీరు లేకుండా జీవించగలరా?
హాస్పిటల్లలో ఆక్సీజన్ లేకుండాజీవించ గలరా?

వ్యవసాయ భూములపై వ్యవసాయ పంటలపై
పన్నులు చెల్లించని భూస్వాములకు 
గ్రానైట్ తీసే మైనింగ్ భూములకు 
స్కూళ్ళు కాలేజీలు కట్టిన భూములకు 
కబ్జాలు చేసిన ఫామ్ హౌస్ లకు
బీడు పడి ఉన్న బినామీ భూములకు 
రైతు బంధు పథకం ఎంత వరకు సబబు?

దేశంలోని ప్రజలందరు వృత్తినినమ్ముకున్నవారే
మట్టిని నమ్ముకున్న వారే పుట్టను నమ్మేవారే
కష్టాన్ని నమ్మిన వారే కాలాన్ని నమ్ముకున్నవారే
ఏ కల్మషము ఎరగని వారే!

ఇక సన్నకారు రైతులు కోరేది రైతు బంధు కాదు 
పండిన పంటకు గిట్టుబాటు ధర 
నాణ్యమైన విత్తనాలు సకాలంలో ఎరువులు 
పండిన పంటలు నిల్వ చేసుకోడానికి గిడ్డంగులు 

తక్షణమే రైతు బంధు క్రమబద్ధీకరించాలి
లేదా అన్ని వృత్తులు వారికి పధకాలను వర్తింప చేయాలి!

*మార్గం కృష్ణ మూర్తి*

No comments: