Wednesday, April 9, 2025

ఆది లోనే హంస పాదు

అంశం: సంకేతం


శీర్షిక: *ఆది లోనే హంస పాదు*

తరిగే అందాన్ని ఎవరూ దాపలేరు
పెరిగే వయసును ఎవరూ ఆపలేరు
చంచల మనసును ఎవరూ చూడలేరు
నిప్పులాంటి నిజాలను ఎవరూ దాచలేరు!

మండే ఎండలను ఆపగలమా
నిలకడగా ఉన్న భూమి రేట్లను దాపగలమా
పెరిగే బంగారం ధరలను నిలువరించ గలమా
చెరువుల్లో తరిగే నీటిని అడ్డుకో గలమా!

నూతన తెలుగు సంవత్సరాది ఉగాది
విశ్వా వసు నామ సంవత్సరం దేనికి సంకేతం
ఆది లోనే హంస పాదు అన్నట్లు
పెద్దన్న దెబ్బకు దేశాలు గొల్లుమంటున్నయి
ఆర్ధిక వ్యవస్థకు మూల స్థంభమైన
షేర్ మార్కెట్ ను మూచ్యువల్ ఫండ్స్
అతలా కుతలమవుతున్నయి!

స్థిరంగా ఆదాయం వచ్చే వేతన జీవులు
ఉచితాల పైననే జీవించే నిరు పేదలు
ఎలాగో అలాగూ నెట్టుక రావచ్చు
అటు ఇటు గాని మధ్య తరగతి ప్రజలు
అప్పుల ఊబిలో కూరుకు పోతున్నారు!

చాప కింద నీరులా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు
ఊడి పోతున్నాయి
గుట్టు చప్పుడు కాకుండా కర్మాగారాలు
మూతపడుతున్నాయి!

*విశ్వా వసు* పేరు లోనే ఉంది నమ్మకమని
అతి విశ్వాసం కూడా అనర్ధ దాయకమేమో
ప్రజల ప్రబల నమ్మకాన్ని వమ్ము చేస్తుందా
లేక దుమ్ము లేపుతుందా వేచి చూడాల్సిందే!
ఆశావహ దృక్పథానికైనా ఒక హద్దు ఉండాలి
అంతరాత్మను ఎంత కాలం వంచిద్దాం!
ఏది ఏమైనా
*విశ్వా వసు* నామ సంవత్సర ఉగాది
దేశ ప్రజలకు సకల సంపదలు
ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు
అందించాలని మనసా వాచా కర్మణా
కోరుకుందాం!

No comments: