Saturday, April 12, 2025

మానవ సంబంధాలు (దీర్ఘ కవిత)

శీర్షిక: - *మానవ సంబంధాలు*

                  (దీర్ఘ కవిత)

మానవ సంబంధాలు
మసక మారుతున్నాయి
కాదు కాదు అవి మంట కలుస్తున్నాయి
ఏదేని పెళ్లిలో ప్రభోజనంలో ఫంక్షన్ లో
నలుగురు కలిసి నపుడు తినునపుడు
కూర్చుని నపుడు నిలబడి నపుడు వచ్చేవి
నిజానికి *నవ్వులు కావవి కాగితపు పువ్వులు*
అవి వెటకారంతో దగదగమెరిసి పోతుంటాయి
ఎదుటి వారి గుండెల్లో రగిలి పోతుంటాయి

పూర్వ కాలంలో
నీకెంత మంది పిల్లలు నీకెంత మంది పిల్లలని
ఒకరికొకరు బాగోగులు తెలుసుకునేవారు
పెళ్ళిళ్ళకు పబ్బాలకు 
పది రోజుల ముందు ఇంటికి వచ్చినా
ఆత్మీయ ఆలింగనం చేసుకుని
సంబరాలు చేసుకునే వారు
పిల్లలు ఎవరికి ఏ వరుసవుతారో తెలుసుకుని
ఆప్యాయంగా పిలుచుకునే వారు
వెళ్లి పోతామంటే సంచో గొడుగో చెప్పులో
ఊతకర్రో తీసి దాచి పెట్టే వారు
తప్పని పరిస్థితిలో పావు గంట ఏడ్చి
భాధతో సాగనంపే వారు
ఆ రోజంతా ఏదో పోగొట్టుకున్నట్లుగా
ఏ పనీ చేయకుండా ఉండేవారు

నేటి కాలంలో
రేపు పెళ్ళి అనగా వాట్సాప్ లలో
ఇన్విటేషన్ కార్డు పంపిస్తారు
వస్తే రానీ పోతే పోనీ
ఫోన్ చేస్తే నిజంగానే వస్తారేమో
ఒక వేళ వచ్చినా
వారు వెంటనే వెళ్ళి పోయేటట్లు
పొమ్మన లేక పొగబెట్టినట్లు
ఫంక్షన్లను ఉదయానికే మార్చేస్తున్నారు

ఇక వచ్చిన బంధువులు ఒకరితో నొకరు
నీవు ఏమేమి ఆస్తులు కొన్నావు నీవెన్ని ఇండ్లు కట్టించావు అని తెలుసుకోవడం పైననే ధ్యాస
*కడుపులో ప్రేమ కాదు అది కపట ప్రేమ*
నా కన్న ఎక్కువ ఎంత సంపాదించాడోననీ
ఈర్ష్య అసూయ కుల్లు..
నలుగురి ముందు కొంగ జపంలా నటన
నటశేఖర బిరుదు ఇవ్వవచ్చు రేపు వారికి
చూపులు తూర్పుకు మాటలు ఉత్తరానికి
ఎదుటి మనిషి దక్షణాన
మూతి ముడుపులు
అప్పుడప్పుడు స్వరంలో శబ్ధాలు
ఎవరిని ఏమని సంబోధించాలో
పెద్దలకే తెలియని దుస్థితి
ఆ కొద్ది సమయం ఈర్ష్య అసూయలతోనే
రావడమే అక్షింతల సమయానికి
వీడియోలు ఫోటోల కారణంగా
తాలి కట్టడం లేటయితే విసుగుతో
చరవాణిలో సమయమెంతైందీ
ఎప్పుడు బయట పడుదామన్న చిరాకు
ఓ పది రూపాయలు కట్నం వేయడానికి
క్యూ ఆర్ కోడ్ ఎక్కడా అని వెతకటాలు...

పోనీ ఇంటికెళ్ళి చేసే
ముఖ్యమైన పని ఏమైనా ఉందాంటే
ఈగలు కొట్టుకోవడం తప్పా ఏమీ ఉండదు
అసలు విషయం అక్కడ అందరూ
తనకంటే తక్కువ వారే అన్న భావన
నేనే అందరికంటే గొప్పవాడినన్న  అహం
వారి ముందు ప్రక్కన కూర్చోవాలంటే
ఇంకేమి అడుగుతారో నన్న అసహనం
మాకే అందరూ నమస్కారం చేయాలన్న
టెంపరి తనం
మాట్లాడితే వారికింద చిన్నతనం
అవుతుందన్న అహంభావం

ఒక్క రోజు కూడా ఆనందంగా గడపలేని
జీవితం ఎందుకు?
తోటి మనుషులను పశుపక్షాదులను
జంతువులను ప్రకృతిని చూడ లేని
ఆ కనులు ఎందుకు?
ఆపదలో ఉన్న వాడికి వికలాంగులకు
దానం చేయని
తల్లిదండ్రులకు సేవ చేయలేని
గురువులకు నమస్కరించలేని
ఆ చేతులు ఎందుకు?
ప్రేమగ ఆత్మీయంంగా పలుకలేని
ఆ నాలుక ఆ నోరు ఎందుకు?
దైవాన్ని భక్తితో పూజించ లేని 
ఆ పెదవులు ఎందుకు?
జనబాహుళ్యానికి ఉపయోగపడే 
ఒకే ఒక్క నిర్ణయాన్ని తీసుకోలేని 
ఆ మెదడు ఎందుకు?
తోటి వారిపై జాలి దయ కరుణ చూపని
ఆ హౄదయమెందుకు?
ఒక్క సారైనా దైవ సన్నిధికి వెళ్ళలేని
అనాధలకు నాలుగడుగులు శవపేటిక
మోయలేని కాళ్ళు ఎందుకు?
దుఃఖంతో ఉన్నవారికి నేనున్నాననీ
ఒక ధైర్యం బరోసా ఇవ్వలేని శక్తి ఎందుకు?

మనిషి ఒక్క విషయం మరిచి పోతున్నాడు
తాను పోయే నాడు
అన్నీ ఇక్కడే వదిలి వెళ్ళాలనేదీ
తన వెంట ఏ బంధుమిత్రులు రారనీ
చివరకు భార్యా పిల్లలు కూడా వెంట రారనీ
తన వెంట వచ్చేవి తాను బ్రతికుండగా చేసిన
మంచి చెడులే ననీ
తనను మోయడానికి కనీసం నల్గురు
ఆత్మీయులైనా కావాలనీ
తన కర్మలు చేయడానికి కూడా కొడుకులు
బిడ్డలు ఆన్లైన్ లో వెతుకుతున్నారనీ
అందరూ పోయేది శ్మశానానికి ననీ
అదీ స్వర్గానికో నరకానికో తేల్చుకోలేని దుస్థితనీ!

No comments: