అంశం: కురిసి అలసిన మేఘం
శీర్షిక: అంతిమ దశ
భగభగ మండే సూరీడు
అస్తమించిన సంధ్యావేళలా
కురిసి అలసిన మేఘంలా
మనిషి వృద్ధాప్య దశలో
తన అనుభవాలను నెమరువేసుకుంటూ!
ఈ జీవన సాగరంలో
ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటూ
సముద్రంలోని సుడిగుండాల వలెను
ఎన్నెన్నో ఇక్కట్లకు గురవుతూ
మరెన్నో అనుభవాలు గడిస్తూ
బాధలు ఎన్నో సంతోషాలు ఎన్నో
దుఃఖాలు ఎన్నో ఆనందాలు ఎన్నో
కష్టాలు ఎన్నో సుఖాలు ఎన్నో
అచ్చట్లు ఎన్నెన్నో ముచ్చట్లు ఎన్నెన్నో
సంపద పోగు చేస్తే నిరుపయోగమని
పైసా పైసా కూడబెట్టి పిల్లల చదివిస్తే
ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలై
మనసుకు నచ్చిన వారిని మనువాడి
రెక్కలొచ్చిన పక్షుల్లా, తెగిన గాలిపటాల్లా
దూరం వెడలి పోయిరి దారిన వదిలేసి
అంతిమ దశలో అర్ధమాయే
పిల్లలకు కష్ట సుఖాలు తెలుపాలని
ఆర్ధిక వ్యవహారాలు వివరించాలని
పిల్లలను డబ్బు డాబుసరితో కాదు
మంచి మనసుతో ప్రేమతో పెంచాలని
ఇప్పుడు విచారిస్తే ఏమి ప్రయోజనం
గడిచిన కాలం తిరిగి రాదు
గడిచిన వయసు తిరిగి రాదు
సాధించాలని మనసున్నా
శరీరం సహకరించదు
జీవిత కాలం తోడుంటానని బాస చేసి
స్వార్ధంతో వెడలి పోగా అర్ధాంగి
ఎండిన మ్రాను వోలే నాది మొండి బ్రతుకాయే
ఎవరి కోసం బ్రతకాలి? ఎందుకోసం బ్రతకాలి?
ఎక్కడికి వెళ్ళాలి?
ఇంకెంత కాలం ఈదాలి? ఈ జీవన సాగరంలో
కురిసి అలసిన మేఘంలా!
No comments:
Post a Comment